మాట్లాడుతున్న - పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డి
కెజిబివి ఉపాధ్యాయులకు మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలి
- పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డి
నెల్లూరు:కొత్త పిఆర్‌సిని అనుసరించి కెజిబివి ఉపాధ్యాయులకు ప్రభుత్వం మినిమం టైం స్కేల్ అందజేయాలని పిడిఎఫ్ ఎంఎల్‌సి అభ్యర్థి పొక్కిరెడ్డి బాబురెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఈ మేరకు ఆయన పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర మంత్రివర్గం కేజీబీవీ ఉపాధ్యాయులకు 23 శాతం జీతాలు పెంచుతున్నట్లు నిర్ణయించినట్లు అధికారులు ప్రకటించారని, వాస్తవానికి కేజీబీవీ ఉపాధ్యాయులకు 2016 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం జీతాలు పెంచలేదన్నారు. మినిమం టైమ్స్ స్కేల్ అమలు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ గత ఆరేళ్లుగా అమలు కావడం లేదన్నారు. ప్రస్తుతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా జీతాలు పెంచామని చెప్పడం సరైనది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పిఆర్‌సి ప్రకారం టైమ్స్ స్కేల్‌ను అనుసరించి రూ. 54,060లు వేతనంగా అందజేయాల్సి ఉంటే రూ. 34,139 లు అందజేస్తున్నట్లు పేర్కొందన్నారు. దీని ప్రకారం ఒకొక్క ఉపాధ్యాయుడు నెలకు రూ.19921లు నష్టపోతున్నారన్నారు. స్కూల్ అసిస్టెంట్లకు మినిమం టైమ్ స్కేల్‌గా రూ.44,570లు చెల్లించాల్సి ఉండగా పెరిగిన 23 శాతం కలిపి రూ. 26,759లు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఒకొక్క స్కూల్ అసిస్టెంట్లు నెలకు 17811 రూ. ప్రతినెల నష్టపోతున్నారన్నారు. కెజిబివి బాలికల పాఠశాలలు బాగా నడుస్తున్నాయని, అభివద్ధి చేస్తామని ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభించినప్పటికీ విద్యార్ధులకు సబ్జెక్టు బోధించేందుకు నియమించిన కాంట్రాక్టు పిజిటిలకు మినిమం టైం స్కేల్ గా రూ. 48,440 లు వేతనంగా అందజేయాల్సిన ప్రభుత్వం వేతనంగా రూ. 12,000 లు మాత్రమే చెల్లిస్తుందన్నారు. కెజిబివిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బాలికల పాఠశాల అయినందున తగిన రక్షణ కోసం వార్డెన్ ని ప్రత్యేకంగా నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుతం ప్రిన్సిపాల్ లేదా ఉపాధ్యాయులు రాత్రులు పిల్లలతో సహా అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, వార్డెన్ నియామకం చేపట్టి ఉపాధ్యాయులకు ఆభారాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కెజిబివి ఉపాధ్యాయులకు కేవలం క్యాజువల్ సెలవులు మాత్రమే ఉన్నాయి. ఇతర ఉపాధ్యాయులకు వల్లే స్పెషల్ క్యాజువల్ సెలవులు ,మహిళా ఉద్యోగులకు ఉన్న ప్రత్యేక సెలవులు ఇవ్వాలన్నారు. అదే విధంగా మెటర్నటీ లీవు,చైల్డ్ కేర్ లీవు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ జీతాలు పెంచామని ప్రకటించడం సరైనది కాదని, 2016 నుండి ఇప్పటివరకు వారికి ఇవ్వవలసిన బకాయిలతో పోలిస్తే ఇది ఎక్కువేమీ కాదన్నారు. కెజిబివి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.










