Dec 24,2020 06:53

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల తరువాత జమ్మూకాశ్మీర్‌ లో బిజెపికి మరోసారి శృంగభంగం జరిగింది. ఆర్టికల్‌ 370 రద్దు చేయడంతో పాటు, ఆ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత మొట్టమొదటి సారి జరిగిన జిల్లా అభివృద్ధి మండళ్ల (డిస్ట్రిక్ట్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌-డిడిసి) ఎన్నికల్లో వివిధ ప్రతిపక్ష పార్టీలతో ఏర్పాటైన పీపుల్స్‌ అలయెన్స్‌ ఫర్‌ గుప్కర్‌ డిక్లరేషన్‌ (పిఎజిడి) ఘన విజయం సాధించిన తీరు అక్కడి ప్రజాభిప్రాయాన్ని దేశ ప్రజల కళ్లకు కడుతోంది. బిజెపి ఏకపక్ష, నిరంకుశ ధోరణలకు ఈ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు! జమ్మూకాశ్మీర్‌ లోని 20 జిల్లాలకు జరిగిన ఎన్నికల్లో 13 జిల్లాల కౌన్సిళ్లను పిఎజిడి కైవసం చేసుకుంది. బిజెపి కి జమ్మూ ప్రాంతం లోని ఆరు జిల్లాలు మాత్రమే దక్కాయి. అయితే, ఈ వాస్తవాన్ని కూడా తిమ్మిని బమ్మి చేసి బిజెపి ఏదో సాధించిందన్నట్టుగా చెప్పడానికి సంఘ పరివారమూ, వారికి కొమ్ము కాసే గోడీ మీడియా చేస్తున్న ప్రయత్నాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. అతి పెద్ద పార్టీగా అవతరించిందనో, కాశ్మీర్‌లో కమలం మొదటిసారి విరబూసిందనో వెలువడుతున్న వార్తలు, వ్యాఖ్యలు ఈ కోవలోవే! ఈ తరహా ప్రచారం ద్వారా వాస్తవాలను మరుగున పెట్టడంతో పాటు, కీలకాంశాలను ప్రజల దృష్టికి రాకుండా చేయడం సంఫ్‌ు వ్యూహం!


జమ్మూకాశ్మీర్‌ లోని 20 జిల్లాల్లోని 280 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఫరూక్‌ అబ్దుల్లా నేతృత్వం లోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌, మెహబూబా ముఫ్తీ నేతృత్వంలోని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పిడిపి)లతో పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌, జెకె పీపుల్స్‌ మూవ్‌మెంట్‌, సిపిఎం కలిసి పిఎజిడి కూటమిగా బిజెపి తో ముఖాముఖి తలపడ్డాయి. ఎన్నికల ముందే ఏర్పడిన ఈ కూటమికి 100కు పైగా స్థానాలు దక్కగా, కూటమి లోని వివిధ పార్టీలు సాధించిన సీట్లను విడివిడిగా చూపుతూ బిజెపి (75 సీట్లు)ను అతి పెద్ద పార్టీగా చిత్రీకరించడానికి ప్రయత్నించడం గోబెల్స్‌ ప్రచారం కాక మరేమవుతుంది? ఈ ఎన్నికల్లో విడిగా పోటీ చేసిన కాంగ్రెస్‌ పార్టీ 23 స్థానాలను దక్కించుకుంది. కాశ్మీర్‌ లోయలో సాధించిన స్థానాల గురించి కూడా సంఫ్‌ు పరివారం ఇటువంటి ప్రచారానికే తెరతీసింది. మొత్తం 10 జిల్లాలున్న ఈ ప్రాంతంలో 72 సీట్లలో పిఎజిడి గెలుపొంది, 9 జిల్లాలను కైవసం చేసుకుంది. ఇండిపెండెంట్లు ఎక్కువమంది గెలవడంతో శ్రీనగర్‌ జిల్లాను ఎవరు దక్కించుకుంటారన్న విషయంలో సందిగ్ధం నెలకొంది. ఇక, కాంగ్రెస్‌ 9 స్థానాల్లో గెలవగా, బిజెపికి దక్కింది మూడంటే మూడే! బిజెపి బలంగా ఉందని భావించే జమ్మూ ప్రాంతంలో ఆ పార్టీ 71 స్థానాలను గెలిచి 6 జిల్లాలను సొంతం చేసుకోగా, 35 స్థానాల్లో గెలిచిన పిఎజిడి నాలుగు జిల్లా కౌన్సిళ్లను కైవసం చేసుకుంది. కుల్గాం జిల్లాల్లో పోటీ చేసిన ఐదు స్థానాలనూ సిపిఎం గెలుచుకుంది. కాశ్మీర్‌ లోయతో పాటు, జమ్మూ ప్రాంతం లోనూ పిఎజిడి గణనీయమైన ప్రభావం చూపిందన్నది నిర్వివాదాంశం. దీనిని తక్కువ చేసి చూపడానికే బిజెపి పడరాని పాట్లు పడుతోంది.


నిజానికి బిజెపి కి కనపడుతున్న సంఖ్యాబలం కూడా వాపే తప్ప బలం కాదు. దాదాపు ఏడాదికి పైగా కొనసాగుతున్న నిర్బంధ పరిస్థితులు ఎన్నికల సమయం లోనూ కొనసాగాయి. బిజెపి కి చెందిన అతిరథ మహారథులు జమ్మూకాశ్మీర్‌ అంతా తిరిగి ప్రచారం చేయగా, కాంగ్రెస్‌ తో పాటు పిఎజెడి నేతలకు ఆ అవకాశం లభించలేదు. వీరిలో కొందరు గృహనిర్బంధంలో ఇప్పటికీ ఉండగా, మిగిలిన వారిపైనా ఆంక్షలు కొనసాగాయి. సభలు, సమావేశాలు స్వేచ్ఛగా నిర్వహించే పరిస్థితి లేదు. బిజెపి తో సమాన అవకాశాలు లభించి ఉంటే పిఎజెడి మరిన్ని సీట్లను సాధించి వుండేదనడంలో సందేహం లేదు. అయినా, పిఎజెడి కే ప్రజానీకం జై కొట్టారంటే వారి అభిమతం స్పష్టం! జమ్మూకాశ్మీర్‌ ప్రజలు ఆర్టికల్‌ 370, 35ఎ రద్దును నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. అదే ప్రజా తీర్పు! నరేంద్ర మోడీ నేతృత్వం లోని కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి! వికృత భాష్యాలకు పోకుండా ప్రజల మనోభీష్టానికి పట్టం కట్టాలి. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించేలా 370, 35ఎ అధికరణాలను పునరుద్ధరించాలి.