ఎ.పి విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా ఘనంగా ప్రకటించబడిన పోలవరం కేంద్రం వివక్షతో సమస్యాత్మకంగా నడుస్తుంటే జరిగినమేరకు పనులు కూడా ప్రజల పాలిట ప్రాణాంతకం అవుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తి బాధ్యత తమదంటూనే పెరిగిన వ్యయాన్ని లెక్క లోకి తీసుకోకపోవడం ఒకటైతే ప్రాథమిక సూత్రమైన సహాయ పునరావాస కార్యక్రమాలకు అసలే బాధ్యత లేదని దులిపేసుకోవడం కేంద్రం చేస్తున్న దారుణం. పెరిగిన ప్రాజెక్టు వ్యయం ముంపు గ్రామాల ప్రజల పునరావాసానికి కావలసిన భారీ మొత్తం కేంద్రం నుంచి రాబట్టడానికి గాని గట్టిగా పోరాడలేని రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్మాణ పనులు సాగిస్తూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నది. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పునరావాస పనులు సరిగ్గా జరగలేదని తాము అధికారంలోకి రాగానే పటిష్టంగా ఆదుకుంటామని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ పదేపదే ప్రకటించారు. అప్పట్లో ఎన్నికల ప్రచారంలో స్వయంగా ప్రధాని మోడీనే పోలవరం నిర్మాణం అక్రమాలకు నిలయంగా మారిందని ఆరోపించారు. తర్వాత ఆయన మళ్లీ ప్రధాని అయ్యారు, జగన్ ముఖ్యమంత్రి అయ్యారు గాని పోలవరం వెతలు మాత్రం తీరలేదు సరికదా తీవ్ర మానవ సంక్షోభంగా మారుతున్నాయి. కాఫర్ డ్యామ్ ఘనంగా కట్టేసిన కారణంగా వర్షాలు పెద్దగా కురవకపోయినా సరే నీళ్లు ముంచేస్తున్నాయి. ప్రాజెక్టులను దీర్ఘకాలిక పథకాలుగా గాక రోజువారి ప్రచారాంశాలుగా మార్చిన గత, ప్రస్తుత ప్రభుత్వాల తీరు వల్ల ప్రతివారం ఏదో సాధించినట్టు చూపించుకోవడానికి మంత్రులు పాలక పార్టీ నాయకులు పర్యటనలు చేసి ఫలానా తేదీకల్లా నీరు వచ్చేస్తుందని మాట్లాడి వెళ్లిపోతున్నారు. కాని మరోవైపున అపారమైన నీటి నిల్వతో మునిగిపోయే వందలాది గ్రామాలలోని లక్షల మంది ప్రజల భవిత, భద్రతపై మాత్రం పెదవి మెదపడం లేదు. అసలు జాతీయ ప్రాజెక్టు అంటున్న పోలవరం ముంపు గ్రామాల ప్రజలు అందులోనూ అత్యధికులు గిరిజనుల పునరావాస బాధ్యత ఖర్చు కేంద్రం భరిస్తుందా లేదా అన్నదే ఇప్పటికీ అస్పష్టంగా వుంది.
ఫలితం లేని వినతులు
నిర్మాణ వ్యయం మాత్రమే అదీ 2014 నాటి లెక్కల ప్రకారం రూ.22 వేల కోట్లు-అది కూడా ముందు రాష్ట్రం ఖర్చు చేసిన తర్వాత మాత్రమే తాము విడుదల చేస్తామని కేంద్రం చాలాసార్లు ప్రకటించింది. వాస్తవానికి దేశంలో ఎక్కడ ఏ ప్రాజెక్టు కట్టినా ముందు పునరావాస కల్పన, జీవనోపాధి పునరుద్ధరణ జరగాలని సుప్రీంకోర్టుతో సహా న్యాయస్థానాలు అనేక సార్లు చెప్పి వున్నాయి. ప్రాజెక్టు బాధ్యత కేంద్రానిది అయినప్పుడు పునరావాస బాధ్యత ఎక్కడకు పోతుంది? కనీస ఇంగిత జ్ఞానానికి మానవత్వానికి సంబంధించిన ఈ అంశంపై కేంద్రంలోని మోడీ సర్కారు కావాలనే వంకర టింకర వాదనలతో చేతులు దులిపేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం నిష్క్రియా ప్రియత్వం వహిస్తున్నది. అడపాదడపా వినతులతో సరిపెడుతున్నది. గత నెలలోనే ముఖ్యమంత్రి జగన్ స్వయంగా ఢిల్లీ వెళ్లి వినతి పత్రాలు ఇచ్చి వచ్చారు. కేంద్రం నుంచి ఈ విషయంలో రావలసిన సహాయం రావడం లేదనే వాస్తవం ప్రజలకు చెప్పి ప్రతిపక్షాలను కలుపుకొని ఒత్తిడి పెట్టే బదులు టిడిపి వైసీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంలో మునిగి తేలుతున్నాయి. రూ.55 వేల కోట్లకు పెరిగిన ప్రాజెక్టు అంచనా వ్యయం పెంపును తాము ఆమోదింపచేసుకుంటే ఈ ప్రభుత్వ హయాంలో వెనక్కు పోయిందని టిడిపి చాలా కాలం విమర్శించింది. అయితే తర్వాత జల్‌శక్తి శాఖ పోలవరం ప్రాజెక్టు అధారిటీ (పిపిఎ) ఈ పెరిగిన ఖర్చుకు ఒప్పుకున్నట్టు అది తమ విజయమైనట్టు వైసీపీ నేతలు చెప్పుకున్నారు. అందులో భాగంగా కొన్ని వందల కోట్లు విడుదల చేస్తే అదో ఘనతగా చూపించుకున్నారు. అసలు సమస్యగా వున్న పునరావాసం దాటేస్తున్నారు. కాని అక్కడ గ్రామాలు మాత్రం మునిగిపోతుండగా వచ్చే నీటి నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి కొండలపై తల దాచుకుంటున్నాయి ఎన్నో గ్రామీణ కుటుంబాలు. ఇప్పటికీ మునిగిపోయిన వాటిలో ప్రజలకే సరైన పునరావాసం లేకుంటే ఇంకా పెరిగే ముంపు తట్టుకోవడం ఎలా అని గ్రామస్తులు ప్రాణాలు అర చేత పెట్టుకుని బిక్కుబిక్కుమని బతుకున్నారు. వారికి నివాసం, గ్రాసం, ఉపాధి ప్రతిదీ దినదిన గండంగా మారిన విషాదం. ప్రచారార్భాటంతో పర్యటనలకు వెళ్లి ప్రతిపక్షంపై సవాళ్లు విసిరే మంత్రులు అనిల్‌కుమార్ వంటివారు దీనిపై మాట్లాడకుండా అధికారులకు ఆదేశాలు ఇచ్చేసి అంతా అయిపోయినట్టే అభినయిస్తారు.
తొమ్మిది గ్రామాలకే దిక్కు లేదు, అన్నీ ఖాళీ అయితే?
పోలవరం ముంపు ప్రాంతం ప్రజలకోసం పనిచేస్తున్న ప్రజా సంఘాల నాయకులు ఇచ్చిన వివరాలు చూస్తే సమస్య తీవ్రత కళ్లకు కడుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం, నీటినిల్వ ప్రవాహం కారణంగా 275 గ్రామాలలో 1.07 లక్షల కుటుంబాలు నిర్వాసితమవుతాయి. లక్షా ముప్పై వేల ఎకరాలు మునిగిపోతాయి. పశ్చిమగోదావరి జిల్లాలో కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలో పోలవరం, దేవీపట్నం, వరరామచంద్రాపురం (వి.ఆర్.పురం), చింతూరు, ఎటపాక, కూనవరం మండలాలు మునిగిపోతాయి. ఇందులో దేవీపట్నం, పోలవరం మినహా మిగిలిన మండలాలన్నీ తెలంగాణ నుంచి బదలాయించబడినవే. పోటీ పడి కాఫర్‌డ్యాం పూర్తి చేయడం, దాని ఎత్తు పెంచాలనీ, వీలైతే దాని ద్వారా ముందే నీళ్లు ఇవ్వాలని ఉత్సాహపడిన సర్కార్లు ఫలితంగా సంభవించే ముంపు బాధితుల గోడు మాత్రం పట్టించుకోలేదు. నిర్మాణ పనులు ఇంతగా జరిగాయని చెబుతున్న సర్కారు అరకొర పునరావాసం కల్పించింది మాత్రం కేవలం 9 గ్రామాలలో 3300 కుటుంబాలకు మాత్రమే. ఇది మూడు శాతం కూడా కాదు. పైగా ఇవి ప్రాజెక్టు కట్టే ప్రాంతాలు. జల విద్యుత్ ప్రాజెక్టు పనుల కోసం మరో 60 గ్రామాలవారిని బలవంతాన అక్కడి నుంచి తొలగించినంత పనిచేశారు. ఇక 41.15 కాంటూరు పరిధిలోకి వచ్చే 90 గ్రామాలు ఖాళీ చేయించాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నది. ఇప్పుడు నిల్వ చేసిన నీటిని వదలడానికి స్పిల్‌వే గేట్లు ఉపయోగిస్తున్నారు. రేపు ఆ గేట్లు మూసేస్తే మొత్తం ఊళ్లూ మునిగిపోతాయి. 9 గ్రామాల పునరావాసమే ఇంత అధ్వాన్నంగా వుంటే మొత్తం ముంపు గ్రామాల గతేమిటని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. పునరావాస కల్పన తర్వాతనే ప్రాజెక్టుల పూర్తి అన్నది సుప్రీంకోర్టు నిర్దేశం. కాగా 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమికి భూమి ఇవ్వాలి. ఉపాధి కల్పించాలి. కాని గిరిజనుల పోడు భూములకు పట్టాలు లేవనే సాకుతో పరిహారమే ఎగవేశారు. ఇది గాక 39 సదుపాయాలతో ప్రత్యామ్నాయ గృహ నిర్మాణం ప్రభుత్వాల నిర్మాణ సంస్థల బాధ్యత. పోలవరం పునరావాసానికి కనీసం 33 వేల కోట్ల రూపాయలు అవసరమని అంచనా. ఇప్పటికి ఇందులో పదోవంతు కూడా కేటాయించిన పాపాన పోలేదు. అయితే వారిని తరలించడానికి లక్ష్యాలు మాత్రం నిర్దేశించారు. ప్రస్తుతం తరలించాల్సిన జనావాసాలు 24 వున్నాయని జూన్ నాటికి 1999 కుటుంబాలు, జులై నాటికి 5226 కుటుంబాలు, ఆగష్టు నాటికి 9069 కుటుంబాలు తరలిస్తామని ప్రకటించారు. ఇంతటి భారీ ప్రణాళికకు రాష్ట్రం రూ.550 కోట్లు విడుదల చేసిందంటే ఏ మూలకు? ఇక కేంద్రం జాగ్రత్తల గురించి మాత్రం నీతులు చెబుతున్నది. హెచ్చరికలు చేస్తున్నది తప్ప పైసా విదిలించింది లేదు. ప్రాజెక్టు వ్యయంలో 70 శాతం ఇదే. లక్షల మందితో ముడిపడిన 33 వేల కోట్ల ఖర్చును విడుదల చేయకుండా కబుర్లతో కాలక్షేపం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకానికి పోలవరం ప్రాజెక్టు గ్రామాల ప్రజలు ఇప్పటికే కష్టాలముంపులో చిక్కుకుపోయారు. వారికి ఆర్థిక ప్యాకేజీ అందింది లేదు. అంతకుముందు చంద్రబాబు ఎకరాకు 1.25 లక్షల చొప్పున ఇచ్చిన ప్యాకేజీ సరిపోదని తాము వస్తే 10 లక్షలు ఇచ్చి పంపిస్తామని జగన్ అప్పట్లో హామీ ఇచ్చారు, ఇప్పటికీ సమీక్షలలో అదే చెబుతుంటారు గాని వాస్తవంలో ఇచ్చింది లేదు.
నిబంధనల ఉల్లంఘన, అర్హులకు అన్యాయం
ఇక అర్హుల విషయమే చూస్తే గతంలో అనర్హులను చేర్చడం వల్ల దాన్ని సాకుగా చూపి బాధితులకు కూడా అన్యాయం చేశారు పాలకులు. వాస్తవానికి ఆ సంఖ్య పెరుగుతున్నది. 2017ను కొలబద్దగా తీసుకుని 18 ఏళ్లు పైబడినవారు 1.25 లక్షల మంది వున్నారని లెక్కవేశారు. 2021 నాటికి పూర్తికాని పనులతో ఆ సంఖ్య 5 లక్షలు దాటింది. అంటే గత అంచనాలు ఏమూలకు చాలవన్నమాట. నిర్వాసితుల కోసం కట్టిన కాలనీలు లోపభూయిష్టంగా ఎలాటి వసతులు లేకుండా కాస్త వానకే కారుతూ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇలాంటి కాలనీలు కట్టించినందుకు గత ప్రభుత్వంపై నిప్పులు కక్కిన వైసీపీ నేతలు ఇన్ని లక్షల మందికి అవసరమైన కనీస వసతులతో గృహ నిర్మాణం చేసింది లేదు. ఏకంగా 30 లక్షల ఇళ్లు కట్టి పండుగ చేస్తాంటున్న సర్కారు ముంపు ప్రాంతాల్లో ఎందుకు కట్టడం లేదు? గిరిజనులకు షెడ్యూలు ప్రాంతాలలోనే పునరావాసం కల్పించాలి గాని నాన్‌షెడ్యూల్ ప్రాంతాలకు తరలించి తంతు పూర్తి చేయడం మరో రాజ్యాంగ విరుద్ధ చర్య. ఇక్కడ 60 శాతం పైనే గిరిజనులేనని అంచనా. ఇవన్నీగాక మానవ హక్కుల సమస్యలు కూడా వున్నాయి. ఉదాహరణకు ముంపు వచ్చేలోగా సరుకులు తీసుకుపోవడానికి టేకూరు వాడపల్లి తూటూరు వంటి గ్రామాల నుంచి ఏలూరు వచ్చిన ప్రజలను తిరిగి వారి గ్రామాలకు పోనీకుండా పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఇటీవల అఖిలపక్ష నాయకులు ఆ గ్రామాలలో పరిశీలనకు వెళ్లినపుడు నిర్వాసితులు చెప్పిన వాస్తవాలు హృదయ విదారకంగా వున్నాయి. వాటిపై విజయవాడలో దీక్షలకు పిలుపునిస్తే ఆ దీక్షలను చూపించి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేబదులు వారిని ఎక్కడికక్కడ నిర్బంధించి రాకుండా చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పుండు మీద కారం రాసింది.
ప్రజలపై నిర్బంధం కాదు, కేంద్రంపై పోరాటం
కేంద్రం జాతీయ ప్రాజెక్టు అంటూనే పోలవరం నిర్మాణ నిధులు, పునరావాస వ్యయం విడుదల చేయకపోవడం బాధ్యతా రాహిత్యమే. దీనిపై అందరినీ కలుపుకొని గట్టిగా పోరాడే బదులు ప్రభుత్వం నిర్వాసితులను చిక్కుల పాలు చేయడం బాధ్యతా రాహిత్యమే. వ్యవసాయం నిలిచిపోయి పంటలూ పనులు లేక ఆ ప్రజల పరిస్థితి మరింత దారుణంగా వుంది. కేంద్రంతో పోరాడి రూ.33 వేల కోట్ల నిధులు తక్షణం రాబట్టి కనీస వసతులతో కాలనీలు నిర్మించి వారిని తరలించకపోతే తీవ్ర అసంతృప్తికి, ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. ఇప్పటికే ప్రత్యేక హోదాకు ఎగనామం లోటు భర్తీకి మంగళం రాజధానికి రిక్తహస్తం విశాఖ ఉక్కు బేరం వంటి కేంద్ర చర్యలు రాష్ట్ర ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఏ ఒక్క అంశంలోనూ ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలనే ధోరణి మోడీ సర్కారులో లేకున్నా గట్టిగా అడిగే చేవ జగన్ సర్కారుకూ వుండటం లేదు. అయితే ఊళ్లకు ఊళ్లే వందలాదిగా మునిగిపోయే పోలవరం సమస్య చాలా తీవ్రమైంది. ఇప్పటికైనా ఆ ప్రజల బాధలు విని సత్వర సహాయం, పునరావాసం కల్పించడం కేంద్ర రాష్ట్రాల బాధ్యత. లేకుంటే వారి నిరసన ప్రజ్వరిల్లడం అనివార్యం.
- తెలకపల్లి రవి










