Dec 20,2021 08:34
  • విఎఎ, ఎంఎఒలకు రికవరీ బాధ్యత
  • సంక్షేమ పథకాలతో లింక్‌

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : కౌలు రైతులకు బ్యాంకులు పంపిణీ చేసిన పంట రుణాల వసూళ్ల బాధ్యతను గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న విలేజి అగ్రికల్చర్‌ అసిస్టెంట్ల (విఎఎ)కు ప్రభుత్వం అప్పగించింది. మండల వ్యవసాయాధికారులు (ఎంఎఒ) లోన్ల రికవరీని పర్యవేక్షిస్తారు. రైతుల కోసం సర్కారు అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలను అప్పుల వసూళ్లకు లింక్‌ చేయనున్నారు. సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను గుర్తించే విషయంలో విఎఎలు, ఎంఎఒలు కీలకంగా వ్యవహరిస్తారని, వారికే రుణాల రికవరీ బాధ్యత అప్పగిస్తే త్వరగా వసూళ్లవుతాయన్న యోచనలో ప్రభుత్వం ఉంది. కౌలు రైతులకు బ్యాంకులు రుణాలివ్వట్లేదని చాలా కాలంగా ఆందోళనలు సాగుతున్నాయి. దాంతో వాస్తవ సాగుదారులకు అప్పులివ్వాలని తరచు బ్యాంకర్ల సమావేశాల్లో సర్కారు కోరుతోంది. ప్రతిగా బ్యాంకులు తామిచ్చిన రుణాలు తిరిగి వసూలు కావట్లేదని చెబుతున్నాయి. కొన్ని బ్యాంకులైతే కౌలు రైతులకు ఇచ్చిన రుణాల్లో 39 శాతం మేర మొండి బకాయిలు (ఎన్‌పిఎ) ఉన్నాయని పేర్కొంటున్నాయి.
 

                                                         వారే ఎందుకంటే..

కౌలు రైతులకు ఇచ్చిందే తక్కువ కాగా, ఇచ్చిన వాటిలో పెద్ద సంఖ్యలో కాలం మీరిన (ఒడి), ఎన్‌పిఎలు ఉన్నాయని బ్యాంకులు కొర్రీలు వేస్తున్నాయి. బ్యాంకులను ఒప్పించి కౌలు రైతులకు రుణాలిప్పించాల్సిన ప్రభుత్వం, బ్యాంకులిచ్చిన కొద్ది పాటి అప్పులను ముక్కుపిండి వసూలు చేసేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చింది. సీజన్‌ వారీగా గ్రామ సచివాలయాల్లోని రెవెన్యూ అధికారులు (విఆర్‌ఒ) జారీ చేసిన పంట సాగుదారు హక్కు పత్రాల (సిసిఆర్‌సి) వివరాలను సర్వీస్‌ ఏరియా బ్యాంకర్లకు ఎప్పటికప్పుడు పంపుతారు. వ్యవసాయశాఖ నిర్వహించే ఇ-పంట పోర్టల్‌లో సాగుల నమోదును ఆధారం చేసుకొని విఎఎలు కౌలుదార్లకు గుర్తింపు పత్రాలు జారీ చేస్తారు. సిసిఆర్‌సి లేక విఎఎలు ఇచ్చే ధ్రువీకరణ పత్రాలపై బ్యాంకులు రుణాలివ్వాలి. రుణాలు పొందిన కౌలు రైతుల జాబితాలను బ్యాంకులు ఎంఎఒ, విఎఎలకు పంపాలి. తమ పరిధిలో రుణాలు తీసుకున్న కౌల్దార్ల నుండి వ్యవసాయాధికారులు రుణాలు వసూలయ్యేలా చర్యలు చేపట్టాలి. విఎఎ, ఎంఎఒ రోజువారీ విధుల్లో రుణాల వసూళ్లు భాగమవుతాయి. ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేసే అధికారులే రుణాల రికవరీ చేపడితే తొందరగా వసూలవుతాయని ప్రభుత్వం ఎత్తు వేసింది. ఆ మేరకు బ్యాంకులకు భరోసా కల్పిస్తోంది.
 

                                                       ఇచ్చిందే స్వల్పం

కౌలు రైతులకు బ్యాంకులు ఇచ్చిన రుణాలు చాలా స్వల్పం. 2020-21 రుణ ప్రణాళికలో 6.52 లక్షల కౌల్దార్లకు రూ.6,500 కోట్ల రుణాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా 97 వేల మందికి రూ.1,054 కోట్లిచ్చారు. అందులో సిసిఆర్‌సిలపై 81 వేల మందికి రూ.669 కోట్లిచ్చారు. ఇచ్చిందే తక్కువ కాగా, కౌలు రైతుల రుణాలే తమను ముంచుతున్నట్లు బ్యాంకులు దుష్ప్రచారం చేస్తున్నాయి. అందుకు ప్రభుత్వం వంత పాడుతోంది.