ప్రజాశక్తి - వన్‌టౌన్
కార్మిక చట్టాలను మార్పు చేసేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె. సుబ్బరావమ్మ తెలిపారు. శుక్రవారం వన్‌టౌన్‌లోని కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్‌లో లేబర్ కోడ్లు రద్దు చేయాలని, కార్మిక ఉద్యమాలపై పోలీస్ అక్రమ అరెస్టులు వేధింపులు ఖండిస్తూ సిఐటియు పశ్చిమ సిటీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె. సుబ్బరావమ్మ పాల్గొని మాట్లాడుతూ కార్మిక హక్కులను కార్పొరేట్ లాభాలకు దాసోహం అవుతున్న కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో కార్మిక 44 చట్టాలను నాలుగు కోడ్లుగా మార్చడం, కార్మికులను బానిసత్వంలోకి నెట్టి వేయడమేనని తెలిపారు. తిరుపతిలో ఈనెల 26, 27 తేదీల్లో జరుగుతున్న దేశవ్యాప్త కార్మిక మంత్రుల సదస్సును సిఐటియు మరియు ఇతర కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.ఏ. గఫూర్, మాజీ రాజ్యసభ సభ్యులు పి. మధును అక్రమంగా అరెస్టులు చేయటాన్ని సుబ్బారావమ్మ తీవ్రంగా ఖండించారు. రైతు వ్యతిరేక చట్టాలు కార్మిక వ్యతిరేక చట్టాలు ప్రజా వ్యతిరేక చట్టాలు చేయడం బిజెపి కేంద్ర ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని సుబ్బరామమ్మ తెలిపారు. సిఐటియు పశ్చిమ నగర కార్యదర్శి బోయి సత్యబాబు మాట్లాడుతూ దేశంలో కార్మికులకు ద్రోహం చేస్తున్న మోడీకి భజన చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ద్రోహులు పక్షాన ఉంటారా, సంపద సష్టించే కార్మికుల పక్షాన ఉంటారా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు పశ్చిమ నగర అధ్యక్షులు ఈ.వి. నారాయణ, నగర సహాయ కార్యదర్శి జి. వెంకట్రావు, యస్. సుబ్బారెడ్డి, సూరిబాబు, వి. సాంబ, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు రమణ పాల్గొన్నారు.










