Apr 17,2022 07:11

   లూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం లోని పోరస్‌ ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలి ఆరుగురు మృతి చెందడంతో ఫార్మా కార్మికుల భద్రత, రక్షణ అంశాలు మళ్లీ చర్చనీ యాంశంగా మారాయి. రియాక్టర్‌ పేలిన ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు సజీవ దహనం కావడం అత్యంత విషాదకరం. మరో 12 మంది కార్మికులు గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో సగం మంది పరిస్థితి ఆందోళనకరంగా వున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఔషధ కంపెనీల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో మరణాలు సంభవించడం, గాయపడి చికిత్స పొందడం మామూలు విషయంగా వుంది. ఔషధ కంపెనీల్లో జరుగుతున్న మానవ హననానికి మూలమెక్కడీ ప్రమాదాలెందుకు జరుగుతున్నాయి? జరగకుండా నియంత్రించగల్గిన మార్గాల్లేవా? అరికట్టగల్గిన సాంకేతిక పరిజ్ఞానం లేదా? ప్రమాదాల్ని నియంత్రించే వ్యవస్థ లేదా? భద్రత తనిఖీ వ్యవస్థలు ఏమయ్యాయి? ఇలా అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఒక చోట కాదు, ఔషధ కంపెనీల ఉత్పత్తి క్రమంలో తరచూ పేలుళ్లు జరుగుతున్నాయి.
    పేలుళ్లు జరగకుండా నియంత్రించే వ్యవస్థలు పటిష్ట పర్చకుండా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తే చాలన్న అనైతిక ఆలోచనకు ప్రభుత్వాలు దిగజారాయి. ఇంట్లో పెద్ద దిక్కుగా వున్న వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి దిక్కు నష్టపరిహారం కింద చెల్లించే డబ్బు అని ప్రభుత్వాలు, యాజమాన్యాలు భావిస్తున్నట్లుంది. విశాఖ నగరంలోని ఎల్‌.జి పాలిమర్స్‌ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించినప్పుడు, మాకు కోటి రూపాయలు వద్దు, మా పిల్లడు కావాలి? నా భర్త కావాలి? మా అమ్మ కావాలి? మా నాన్న కావాలి? అని కుటుంబాలు ఘోషించాయి తప్ప కోటి రూపాయలకు కక్కుర్తి పడలేదు. కావాలంటే కోటి రూపాయలు చందాలెత్తుకొని మేమిస్తాం? సాధారణ ప్రజల చావుకు కారణమైన యాజమానులు చనిపోతే అని ప్రజలు ఎదురుతిరిగారు. మనిషికున్న విలువ డబ్బుకు లేదని ప్రభుత్వాలకు అర్ధంకావాలి.
    జరుగుతున్న ప్రమాదాల తీరును పరిశీలించినప్పుడు ముమ్మాటికీ యాజమాన్యాల నిర్లక్ష్యం, లాభాపేక్ష కారణంగా కన్పిస్తోంది. యాజమాన్యాలు లాభం తప్ప మనిషి ప్రాణాలకు విలువ ఇవ్వడంలేదు. యంత్రాల వద్ద, ప్రమాదకర రియాక్టర్ల వద్ద పని చేసే కార్మికుల భద్రతను పట్టించుకోవడంలేదు. కార్మికులకు రక్షణ పరికరాలు ఇవ్వడంలేదు. ప్రమాద స్థలం నుంచి బయటపడేందుకు మార్గాలు వుంచడంలేదు. విష వాయువులు పీల్చకుండా మాస్క్‌లు సరఫరా చేయడంలేదు. ఇవన్నీ వున్నాయా? లేదా? అని పర్యవేక్షించి, సరిదిద్దాల్సిన పరిశ్రమల ఇన్‌స్పెక్టర్లను వెళ్లనీయకుండా చేసిన దుష్ఫలితాలే ఈ ప్రమాదాలు. ఫ్యాక్టరీల్లో భద్రతా ప్రమాణాలను యాజమాన్యం పాటిస్తున్నదీ, లేనిదీ పరిశ్రమల శాఖాధికారులు తనిఖీ చేసే అవకాశాలను టిడిపి ప్రభుత్వం బలహీనపర్చింది. పరిశ్రమలను ప్రోత్సహించే పేరుతో తనిఖీలు నామమాత్రం చేసింది. లాభాలకు కారణమైన కార్మికుల భద్రత కంటే, యజమానుల లాభాలు ముఖ్యమన్నట్లు ప్రభుత్వాలు వ్యవహరిస్తూ వస్తున్నాయి. పర్యావరణాన్ని గాలికొదిలేస్తున్నాయి. కరోనా కాలంలో కంపెనీలకు లాభాల పంట పండింది. లాక్‌డౌన్‌ కాలంలో కార్మికుల చేత 12 గంటలు పని చేయించుకున్నారు. 4 షిప్టులను 2 షిఫ్టులుగా మార్చేశారు. కార్మికులను బానిసలుగా మార్చి వారిని శ్రమను దోచుకొని నిర్లక్ష్యంగా వుంటున్నారు. నిర్లక్ష్యపు యాజమాన్యాలపై ప్రభుత్వం కన్నెర్రజేయకుండా నిద్రాణంలో వుండడమంటే కార్మికుల ప్రాణాలను గాలికొదిలేయడమే. కార్మికుల్లో వారి కుటుంబాల్లో మనోధైర్యం నింపాల్సిన ప్రభుత్వం కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది.
    ఔషధ కంపెనీలు విడుదల చేస్తున్న వ్యర్ధాల కారణంగా కలుషితమైన నీరు తాగి సమీప ప్రాంత ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. వాయు కాలుష్యానికి ఊపిరితిత్తుల వ్యాధులకు గురవుతున్నారు. విశాఖ జిల్లా పరవాడ లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మా సిటీలో ఈ తరహా అనుభవాలు ఎదురవుతున్నాయి. పరవాడ ఫార్మాలో డెవలపర్‌గా వున్న రాంకీ యాజమాన్యం పర్యావరణ ప్రమాణాలు, పాటించడంలేదు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరుతో అప్పటి ప్రభుత్వం తెచ్చిన జీవో 27 యజమానులకు రక్షణ కవచంగా వుంది. పరిశ్రమలు తనిఖీలపై కర్మాగారాల శాఖ, కాలుష్య నియంత్రణ మండలికి పరిమితులు విధించి యాజమాన్యాలకు మరింత స్వేచ్ఛ కల్పించింది. లైఫ్‌టైమ్‌ లైసెన్సు ఇవ్వడం, తనిఖీలు లేకపోవడంతో యాజమాన్యాలు భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి.
    గత అయిదేళ్లలో ఔషధ కంపెనీల్లో జరిగిన ప్రమాదాలతో 48 మంది మృతి చెందారు. 74 మంది గాయాలపాలయ్యారు. కంపెనీల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. సేఫ్టీ ఆడిట్‌ లేదు. 2017లో నిర్వహించిన సేఫ్టీ ఆడిట్‌లో విశాఖ ఫార్మా సిటీ లోని కంపెనీల్లో 50 శాతం కంపెనీలు భద్రతా ప్రమాణాలు పాటించడంలేదని, 10 శాతం పరిశ్రమలు నడపడానికి వీల్లేని స్థితిలో వున్నాయని నోటీసులు ఇచ్చారు. కాలం చెల్లిన రియాక్టర్లు వాడుతున్నా యాజమాన్యాలపై చర్యల్లేవు.
    ప్రాణాలు కోల్పోయాక ప్యాకేజీలు, నష్టపరిహారం ఇవ్వడం కంటే ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించాలి. పరిశ్రమల వల్ల ప్రాణాపాయం వుండదన్న నమ్మకం కల్గించేలా పరిశ్రమల్లో పర్యావరణ పరిరక్షణ, భద్రతా చర్యలు బలోపేతం చేయాలి. పరిశ్రమలంటే ప్రజలు భయపడే స్థితి నుంచి తమకు ఉపాధి, భద్రత వుంటుందని, జీవనోపాధి లభిస్తుందన్న నమ్మకం ఏర్పరిచేలా ప్రభుత్వం వ్వవహరించాలి. పర్యావరణ, భద్రత ప్రమాణాలు పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవడానికి ఆటంకంగా వున్న నిబంధనలను సడలించి కఠినతరమైన నిబంధనలు తయారుచేసి చిత్తశుద్ధితో అమలు చేయాలి. వై.ఎస్‌. జగన్‌ పాదయాత్రలో ఫార్మా గ్రామాల పర్యటన సందర్భంగా కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామని ఇచ్చిన హామీ అమలు కాలేదు. ఔషధ కంపెనీల్లో భద్రత, రక్షణ చర్యలు చేపట్టేలా వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. తనిఖీలు చేసేందుకు పరిశ్రమల శాఖ, కాలుష్య నియంత్రణ మండలికి అధికారాలు ఇవ్వాలి. ప్రమాణాలు పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకొనేలా వారికి అధికారం కల్పించాలి. భద్రతపై కార్మిక సంఘాల ప్రతినిధులతో చర్చించాలి.
 

వ్యాసకర్త : సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి, సెల్‌ : 9490300010
జి. కోటేశ్వరరావు

జి. కోటేశ్వరరావు