Jul 08,2023 21:50
  • ఈ నెలాఖరుకు నూరుశాతం ఎన్‌రోల్‌మెంట్‌
  • విద్యాశాఖ సమీక్షలో సిఎస్‌ జవహర్‌ రెడ్డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బడి ఈడు పిల్లలను బడికి పంపకపోతే పథకాలు అందవని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. తల్లిదండ్రులకు ఈ సందేశాన్ని తెలియజేసి పిల్లలందరినీ బడికి పంపేలా చూడాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖపై విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం సిఎస్‌ సమీక్ష నిర్వహించారు. వలంటీర్ల ద్వారా చేపట్టిన నూరుశాతం ఎన్‌రోల్‌మెంట్‌ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని జవహర్‌రెడ్డి స్పష్టం చేశారు. నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చిన మరుగుదొడ్లను వినియోగించని పాఠశాలలు, సంబంధిత మండల విద్యాశాఖ అధికారులపై చర్యలకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. మనబడి నాడు-నేడు కార్యక్రమం కింద చేపట్టిన పనులను డిసెంబరు, జనవరి నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. విద్యార్థుల్లో రక్తహీనతను నివారించేందుకు ఐరెన్‌ ఫోలిక్‌ మాత్రలు పంపిణీ చేయడంతోపాటు మధ్యాహ్న భోజన పథకంలో మరింత పౌష్టికత ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికి తీయాలని, మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. క్రీడా పరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి మండల కేంద్రాలు, పెద్ద గ్రామ పంచాయతీల్లోని రెండెకరాల విస్తీర్ణం ఉన్న పాఠశాలలను గుర్తించాలని చెప్పారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం జూనియర్‌ బాలికల కళాశాలతో కలిపి మండలానికి రెండు కళాశాలలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ సర్టిఫికెట్లను విద్యార్థులు డిజి లాకర్‌ విధానంలో భాగంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని, దీనిపై సంబంధిత శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ.. వలంటీర్ల ద్వారా చేపట్టిన ఎన్‌రోల్‌మెంట్‌ ప్రక్రియను ఈ నెలాఖరులోపు పూర్తిచేస్తామని చెప్పారు. ఉపాధ్యాయులకు సంబంధించిన విధానపరమైన అంశాలను రాష్ట్రస్థాయిలో చర్చించి పరిష్కరించాల్సి ఉందన్నారు. నాడు-నేడు పనులను డిసెంబరు నాటికి పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మౌలిక సదుపాయాల కమిషనరు కె భాస్కర్‌ వివరించారు. జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ పూర్తయిందని సమగ్ర శిక్షా అభియాన్‌ డైరెక్టరు శ్రీనివాస్‌ వివరించారు. ఈ సమావేశంలో మధ్యాహ్న భోజన పథకం డైరెక్టరు నిధి మీనాన్‌, పాఠశాల విద్య జాయింట్‌ డైరెక్టరు మువ్వా రామలింగం తదితరులు పాల్గన్నారు.