Feb 16,2023 20:41

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో పస్తుతం ఉన్న ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వడం, క్రమబద్దీకరించడం ద్వారా ఖాళీలను భర్తీ చేయాలని అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌ జవహర్‌ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. వివిధ శాఖల కార్యదర్శుల సమావేశం గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో సిఎస్‌ మాట్లాడుతూ కొత్త జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు సహా వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇక్కడ ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగుల ప్రోబేషన్‌ డిక్లరేషన్‌కు చర్యలు తీసుకోవాలన్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్‌-1,2 స్థాయి పోస్టుల ఖాళీల వివరాలను వెంటనే సాధారణ పరిపాలన శాఖకు అందజేయాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ-ఆఫీస్‌ విధానం కింద ఇ-రిసిప్ట్స్‌,ఇ-డిస్పాచ్‌ విధానానిు పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని చెప్పారు. వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ఎసిబి, విజిలెన్స్‌ కేసులను నిరంతరం మానిటర్‌ చేస్తూ సత్వర పరిష్కారానికి కృషి చేయాలనిచెప్పారు. ఎపి ఆన్‌లైన్‌ లీగల్‌ కేసుల మేనేజ్‌మెంట్‌ విధానం కింద వివిధ శాఖల్లో నమోదవుతున్న కోర్టు కేసులు సకాలంలో కౌంటర్లు దాఖలు చేయడం, కోర్టు కేసులపై జాప్యం లేకుండా సకాలంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగ సంఘాల జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన డిమాండ్లలో ఆర్ధికేతర అంశాలకు సంబంధించిన డిమాండ్లను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.