కలెక్టరేట్ : జర్నలిస్టుల సంక్షేమమే ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ లక్ష్యమని ఎపి ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. సోమవారం వైజాగ్ జర్నలిస్టు ఫోరం నిర్వహించిన మీట్ ద ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఫేక్ జర్నలిస్టుల తొలగింపు జరుగుతుందని, ఆ తరువాత జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అమలవుతాయని చప్పారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియ జాప్యానికి ఇది కూడా ఒక కారణం అన్నారు. ఇప్పుడున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటనే జర్నలిస్టుల్లో రాణింపు సాధ్యమవుతుందన్నారు. ఆ దిశగా నిపుణులతో జర్నలిస్టులకు శిక్షణ ఇప్పించే ప్రక్రియ జరుగుతుందన్నారు. వివిధ శాఖలు అందించే పథకాలను జర్నలిస్టులు ఉపయోగించుకుని వార్తాంశాలు మలచుకునేందుకు వీలుగా ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించి అందుబాటులోకి తెస్తున్నట్లుగా చెప్పారు. ఇది గ్రామీణ జర్నలిస్టులకు అత్యంత ప్రయోజనకరం కాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. వైజాగ్ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, జర్నలిస్టులకు రూ.50 లక్షల హెల్తు ఇన్సూరెన్సు, ఇళ్ల స్థలాల మంజూరుకు ప్రెస్ అకాడమీ చైర్మన్ సహకరించాలని ప్రతిపాదించారు. అనంతరం దేవిరెడ్డి శ్రీనాధ్‌ను సత్కరించారు.










