ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఎపి ప్రెస్ అకాడమీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో బుధవారం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా, సామాజికంగా మహిళలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తుందన్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న జర్నలిజంలో మహిళలు రాణించడం చాలా గొప్ప అంశమని పేర్కొన్నారు. సమాచారశాఖ కమిషనరు టి విజరుకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. మహిళా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ కార్యదర్శి బాలగంగాధర తిలక్, నాగార్జున యూనివర్శిటీ జర్నలిజం విభాగపు అధిపతి ప్రొఫెసర్ అనిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులు రెహానా, హసీనా తదితరులను ప్రెస్ అకాడమీ సత్కరించింది.










