Nov 10,2022 12:48

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌గా కొమ్మినేని శ్రీనివాసరావు గురువారం బాధ్యతలు చేపట్టారు. విజయవాడ మొగల్రాజపురంలోని ప్రెస్‌ అకాడమీ కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెన్నుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాణిక్య వరప్రసాద్‌, రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్‌ టి విజయకుమార్‌రెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షులు విజరుబాబు, తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌ లక్ష్మీపార్వతి, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఎపిడబ్ల్యుజెఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు, నగర అధ్యక్షుడు కలిమిశ్రీ, ఎపిబిజెఎ రాష్ట్ర నాయకులు వి శ్రీనివాస్‌, కె మునిరాజు, పలువురు సీనియర్‌ జర్నలిస్టులు ఈ సందర్బంగా ఆయనకు అభినందనలు తెలిపారు. క్యాబినెట్‌ హోదా వుండే ఈ పదవిలో కొమ్మినేని శ్రీనివాసరావు రెండేళ్లు కొనసాగనున్నారు.
సిఎంకు కొమ్మినేని కృతజ్ఞతలు
బాధ్యతలు స్వీకరించిన అనంతరం కొమ్మినేని శ్రీనివాసరావు సిఎం జగన్‌ను కలిసి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు ప్రెస్‌ అకాడమీ ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగించినందుకు సిఎంకు ధన్యవాదాలు తెలిపారు. చిత్తశుద్ధితో ప్రెస్‌ అకాడమీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.