- ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్
ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్ : గత వందేళ్లలో సమాజాన్ని ప్రభావితం చేసిన సీనియర్ జర్నలిస్టుల జీవిత చరిత్రతో ప్రత్యేక పుస్తకాన్ని రాష్ట్ర మీడియా అకాడమీ తరఫున ముద్రిస్తున్నట్లు ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. నవంబర్ మొదటి వారంలో ఈ పుస్తకాన్ని విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నెల్లూరు నుంచి విజయవాడ వెళుతూ రామాయపట్నం ఓడరేవు నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం ఒంగోలు ఎన్‌ఎస్‌పి అతిథి గృహంలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇచ్చే విషయమై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తున్నట్లు తెలిపారు. రామాయపట్నం ఓడరేవు నిర్మాణంతో అభివృద్ధి పరంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల ముఖ చిత్రం పూర్తిగా మారనున్నాయని అన్నారు. డిసెంబర్ నాటికి మొదటి బెర్త్ పూర్తవుతుందని నిర్మాణ సంస్థ ప్రతినిధులు చెప్పినట్లు తెలిపారు.










