Jul 09,2021 06:08

    ఇంటి చిట్కాల నుంచి ఆయుర్వేదం వరకు...జబ్బుల నివారణకు ఉపకరించాయి. ప్రపంచం లోని ఇతర ప్రాంతాలకు చెందిన ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులు, గిరిజన తెగలు ఉపయోగించిన వైద్య విధానం ఉపయోగపడడమే కాక, తరతరాలుగా ప్రజలకు ఉపకరిస్తూ వస్తున్నది. కానీ వాటి పరిమితులను గుర్తించడమే కాక, అంగీకరించాలి.
     ప్రధాని నరేంద్ర మోడీ చూడడానికి పూర్తిగా ఆధునిక వ్యక్తిగా కనబడతాడు. కాని, తనుకు తాను అతిగా మూఢ నమ్మకాలలో మునిగిపోతాడు. చంద్రమండలంపై పరిశోధనలను ప్రోత్సహిస్తాడు. అధునాతన యుద్ధ విమానాలకు ఆదేశాలు జారీ చేస్తాడు. మొదటి బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడు. భారతదేశాన్ని వ్యాక్సిన్‌ పవర్‌హౌసుగా మారుస్తానని ప్రగల్భాలు పలుకుతాడు. అంతాగాక, ప్రపంచం మొత్తానికి వ్యాక్సిన్‌తో పాటు ఆధునిక సైన్సుకు సంబంధించిన అన్ని రకాల ఉత్పత్తులను కూడా పంపిణీ చేయగలమని చెప్తాడు. అదే సమయంలో సూడో సైన్స్‌ (బూటకపు శాస్త్రం) వైపు మళ్ళుతాడు. సార్స్‌, కోవిడ్‌-19 ను పారదోలడానికి విశ్వశక్తిని ప్రార్థించమని, శుభప్రదమైన సమయాల్లో పురాతన సంఖ్యా శాస్త్రం ప్రకారం గంటలు మోగించమని, శంఖాలు పూరించమని ఉపదేశిస్తాడు. ఔషధ సంబంధిత ఆధారాలు గాని, పరిశోధనలు గాని జరగని, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ చేత గుర్తించబడని... యోగా గురువు రాందేవ్‌ బాబాకు సంబంధించిన కల్పితమైన కల్తీ ఔషధాలను, మందులను తమ క్యాబినెట్‌ సహచరులు ప్రారంభిస్తుంటే ప్రధాని అభ్యంతరం చెప్పరు. పురాణాల లోని... ఏనుగు తలను గణేశుని మెడ పైన అమర్చిన విధానాన్ని ఉదహరిస్తూ, ప్లాస్టిక్‌ సర్జరీని పాశ్చాత్య దేశాలు కనుగొనక ముందే మన దేశం ముందడుగులో వుందని చెప్తారు.
    భారతదేశంలో ఎక్కువ మంది తమను తాము విజ్ఞానవంతులుగా చెప్పుకునేవారు, భిన్నమైన విశ్వాసాలున్న సాధువులు, స్థానిక ఆహార నియమాలను తెలియజేసే నిపుణులు, తమకు తాము డాక్టర్లుగా చెప్పుకునే వారు, పెరుగు, పాలు అమ్ముకొనే వారు, మందుల వ్యాపారులుగా మారి అనేక ప్రత్యామ్నాయ మందులతో వైద్యం చేయడం, సాంప్రదాయ వైద్యులు పరిమితమైన స్థాయిలో బ్లడ్‌ షుగర్‌, కొలస్ట్రాల్‌ స్థాయిలు తెలియజెప్పడానికి ల్యాబులను ఏర్పాటు చేసుకోవడం, పాశ్చాత్య వైద్య పద్ధతిలో ఎక్స్‌రే, ఈసీజీ పరికరాలను సమకూర్చుకోవడం ద్వారా సైన్సుకు కట్టుబడినట్టు తమ పట్ల విశ్వస నీయత కలిగేటట్టు చేసుకుంటున్నారు. ప్రతిదీ నిగూఢ ఆహారాల చుట్టూ చక్కర్లు కొడుతూ, ఆవు పేడ, ఆవు మూత్రం అన్ని జబ్బులకు నివారణనీ.. కోవిడ్‌-19 వ్యాధికి కూడా అదే మందని చెప్పడం వల్ల దేశానికి ఎంతో నష్టం వాటిల్లింది. మధ్యతరగతికి...కామేచ్ఛను, రోగనిరోధక శక్తిని పెంపొందించడం నుంచి తక్షణ మోక్షం పొందేలా హామీలు ఇచ్చే వరకూ వెళ్లారు.
ఇంటి చిట్కాల నుంచి ఆయుర్వేదం వరకు...జబ్బుల నివారణకు ఉపకరించాయి. ప్రపంచం లోని ఇతర ప్రాంతాలకు చెందిన ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులు, గిరిజన తెగలు ఉపయోగించిన వైద్య విధానం ఉపయోగపడడమే కాక, తరతరాలుగా ప్రజలకు ఉపకరిస్తూ వస్తున్నది. కానీ వాటి పరిమితులను గుర్తించడమే కాక, అంగీకరించాలి. ప్రస్తుత నమ్మకాలను, ఆచరించే విధానాలను ప్రశ్నించడమేకాక, ప్రయోగ పద్ధతుల ద్వారా మందులు పని చేస్తున్నాయో లేదో కనుగొన్నారు. ఒకవేళ అవి పని చేయకపోతే, కొత్త ఆలోచనలను ప్రోత్సహించారు. శాస్త్రీయ యుగానికి ఇది ప్రారంభం.
     సైన్స్‌ రంగంలో గొప్పవాళ్ళు తమకు తెలియని విషయాన్ని అంగీకరించనందు వల్లనే, ప్రశ్నించడానికి భయపడనందు వల్లనే శాస్త్ర విజ్ఞానాభివృద్ధి సాధ్యపడింది. ప్రతి తరం విజ్ఞానం యొక్క మూలాలను తరువాత తరానికి అందించింది. ఎందువల్లనంటే, వారు తలుపులను తెలియనిదానికోసం తెరిచే ఉంచారు. ఏదీ ఏమైనా, సూడో సైంటిస్టులు సమాజానికి ప్రమాదకరమైన వారు. ఎందువల్లనంటే, వారు తాము నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. అనుమానాల పట్ల, సందేహాల పట్ల అసహనంగా ఉంటారు. పొరపాట్లను సరిదిద్దుకోవడానికి అన్ని తలుపులనూ సూడోసైన్స్‌ మూసివేస్తుంది. అభివృద్ధిని నిరోధిస్తుంది. ఇది నాగరికతకు ప్రాణాంతకమౌతుంది.
     తిరిగి విషయానికి వస్తే, మోడీ సైన్సుకు సంబంధించిన వ్యక్తా? లేక సూడో సైన్స్‌కు సంబంధించిన వారా? అనేది ఎవరినైనా ఆశ్చర్యానికి గురి చేయక మానదు. భిన్నమైన సందర్భాలలో పై రెండిటిని ఆయన ఎందుకు ముందుకు తెస్తున్నాడు? ఒకవేళ అది రాజకీయ వ్యూహంతో ఓటర్లను దృష్టిలో పెట్టుకొని, ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి ఒకవైపు అధునాతనమైన, హేతుబద్ధమైన...మరోవైపు సంప్రదాయబద్ధమైన మూఢనమ్మకాలతో ప్రయాణించినా...ఇటీవల జరిగిన ఎన్నికలలో పాచిక పారకపోగా, అనుకున్న ఫలితాలు రాలేదు. ఆయన పరస్పర విరుద్ధమైన సందేశాలు, ఆధ్యాత్మిక ప్రత్యేకవాదం, పురాణ రూపకాలు ఇవేవీ...భారతదేశాన్ని సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచంలో అధునాతన ఆర్థిక వ్యవస్థగా ముందుకు తీసుకు వెళ్లాలని ఆసక్తితో ఉన్న ప్రధాని స్థాయికి పొసగనివి. మోడీ విధేయులు, అనుకూల శక్తులు...ఒక దేశంగా భారత దేశానికి మచ్చ తేవడమే కాక, విజ్ఞానాభివృద్ధి వ్యతిరేకులుగా, అభివృద్ధి నిరోధకులుగా, అజ్ఞానులుగా, మూఢనమ్మకాలతో మధ్య యుగాలలోకి పోతున్నామని గుర్తించలేకపోతున్నారు. భారతదేశం ఇప్పటివరకు అభివృద్ధి చెందుతున్న శక్తిగా ఉంది. అకస్మాత్తుగా మునిగిపోతున్న నావలా కనిపిస్తుంది. సూడో సైన్స్‌ అనే విపత్తు సముద్రంలో కూరుకుపోయినట్లనిపిస్తుంది.
    భారతదేశ నాగరికత ప్రారంభ దశ నుంచి, జ్ఞాన సముపార్జన కోసం తపన పడుతూనే ఉంది. గతంలో లోపాలు అనేకం వున్నా జీవితానికి అవసరమైన అంశాలు అనేకం వున్నాయి. ప్రాథమికమైన ఉద్దేశ్యాలు, ప్రభుత్వం యొక్క ఆలోచనలు మన సంస్కృతికి అవసరమైన భాగాలుగా వుంటాయి. అవి మన జీవితంలో భాగంగా స్వీకరించాలి.
     ప్రధానమంత్రి పై విషయాలను ఆలకించాలి. పరిశోధనాత్మక మేథస్సు, తెలుసుకోవాలనే ఆసక్తి, కొత్త ఆలోచనలను సేకరించడం, నూతన విజ్ఞానాన్ని సంపాదించడం...మన ఉనికి లోని ప్రధాన భాగంగా వుంది. ఇంకేమాత్రం కాలయాపన చేయకుండా ప్రధాని మోడీ దేశాన్ని విజ్ఞాన శాస్త్ర మార్గంలోకి మళ్ళించాలి.
 

/ 'ద హిందూ' సౌజన్యంతో/

జి.ఆర్‌. గోపీనాథ్‌