మానవ జాతి ప్రయాణంలో జన చైనాది ప్రత్యేక స్థానం. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఎడాపెడా సాగిన సామ్రాజ్యవాదుల దోపిడిని, వారి తైనాతీలుగా మారిన దేశీయ దోపిడిదారుల పీడనను ఎదుర్కొని చైనా ప్రజలు సాగించిన లాంగ్‌మార్చ్, చేసిన త్యాగాలు సాధించిన విజయం అపూర్వం! పిడికెడు ఉప్పు కోసం ఆడపిల్లలను తాకట్టు పెట్టే దీనస్థితి నుండి, నల్లమందు మత్తు నుండి బైటపడి ప్రపంచంలోనే అభివృద్ధికి చిరునామాగా చైనా ప్రజలు నిలిచిన తీరు అనితరసాధ్యం! ఆ మహత్తర పోరాటానికి, అభివృద్ధి ప్రయాణానికి నాయకత్వం వహించిన చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) శతవార్షికోత్సవాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆధునిక సోషలిస్టు చైనా నిర్మాణమే తమ లక్ష్యమని చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రకటించింది. ఈ లక్ష్య సాధన కోసం రెట్టించిన పట్టుదలతో కృషి చేయాలని కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్ సిపిసి శ్రేణులకు పిలుపునిచ్చారు జన చైనా ఉనికిని గుర్తించడానికి కూడా ఒకప్పుడు ప్రపంచ దేశాలు నిరాకరించాయి. ఈ రోజు ఎన్నో దేశాలకు చైనా ఆర్థిక వ్యవస్థ, అక్కడ తయారయ్యే ఉత్పత్తులు ఊతంగా నిలుస్తున్నాయి. కరోనా కష్టకాలంలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలనీ నేల ముఖం చూస్తూంటే, చైనా ఆర్థిక వ్యవస్థ మాత్రం దానికి భిన్నంగా పైపైకి దూసుకుపోతోంది. గతంలో అంచనా వేసిన దానికన్నా ఈ ఏడాది చైనా వృద్ధి రేటు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని రెండు రోజుల క్రితమే ప్రపంచబ్యాంకు పేర్కొంది. ఇదంతా ఒక్క రోజులో, ఒక్క ఏడాదిలోనో జరిగినదేమి కాదు! ఒక వ్యూహం ప్రకారం, ఎప్పటికప్పుడు ప్రణాళికలు రూపొందిస్తూ చైనా కమ్యూనిస్టు పార్టీ, ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం జరిపిన కృషి ఇది! ఈ క్రమంలో చైనా నేతలు ఎదుర్కొన్న విమర్శలు, కుట్రలు, కుతంత్రాలు ఇన్నీ అన్నీ కావు. వాటన్నింటికీ ఆచరణలోనే చైనా నాయకత్వం సమాధానం చెప్పింది. జనచైనాను నవచైనాగా ప్రపంచం ముందు నిలబెట్టింది. ఆధునిక సోషలిస్టు సమాజ నిర్మాణమే లక్ష్యమని తాజాగా శత వార్షికోత్సవాల సందర్భంగా ప్రకటించడం ద్వారా తామేమిటో, తమ మార్గం ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పింది.
కొంత కాలంగా ప్రైవేటు రంగాన్ని ఆహ్వానించడం ద్వారా అభివృద్ధి లక్ష్యాలను మరింత వేగంగా సాధించడానికి ఆ దేశం ప్రణాళికలు రచించుకుంది. అయితే, ప్రభుత్వరంగం పట్టు ఎక్కడా జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంది, ప్రైవేటు రంగంలోని అవినీతి జాడ్యం ప్రభుత్వ ఉద్యోగులకు, సాధారణ ప్రజలకు వ్యాపించకుండా కఠినంగా వ్యవహరించింది. సంస్కరణలు అమలు ద్వారా దేశీయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌ను సాధించింది. ప్రపంచంలోని 500 ఫార్చ్యూన్ సంస్థల్లో చైనా నుండి 124 సంస్థలకు స్థానం దక్కగా, వాటిలో 91 ప్రభుత్వ సంస్థలే! చైనాలో ప్రభుత్వ రంగ ఆధిపత్యానికి ఇదే నిదర్శనం. అదే సమయంలో ప్రైవేటు రంగానికీ పరిమితుల మేరకు అవకాశాలను కల్పిస్తూనే సంపద విదేశాలకు తరలిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. బహుముఖాలుగా విస్తరించిన ఈ కార్యాచరణే చైనా ప్రజలు పేదరికం నుండి దూరం కావడానికి, కష్ట కాలంలోనూ కొనుగోలు శక్తి పెంచుకోవడానికి, తద్వారా అభివృద్ధిని సుస్థిర పరుచుకోవడానికి దోహదం చేసింది.
జనచైనా అవిర్భావానికి రెండు సంవత్సరాల ముందే స్వాతంత్య్రం పొందినప్పటికీ అభివృద్ధి లక్ష్యసాధనలో నక్కకు నాకలోకానికి మధ్య ఉన్నంత అంతరం రావడానికి పాలకులు అనుసరించిన విధానాలే కారణం. ఒకప్పుడు పురోగతికి దిక్సూచిగా నిలిచిన ప్రభుత్వ రంగాన్ని నీరుగార్చి ప్రైవేటు పరం చేశారు. ఫలితంగా కార్పొరేట్ల దోపిడి పెరిగి, అసమానతలు తీవ్రమయ్యాయి. స్వావలంబన నుండి ఆత్మనిర్భర్ వరకు సాగిన ప్రయాణం దేశీయ ఉత్పత్తి రంగ వెన్నెముకను విరగగొట్టింది. విదేశీ కార్పొరేట్ల సాంకేతికకు మోకరిల్లేలా చేసింది. వ్యాక్సిన్ తయారీలో ఎప్పుడో స్వావలంబన సాధించిన మన దేశం ఇప్పుడు విదేశీ వ్యాక్సిన్ల కోసం పడిగాపులు పడటమే ఈ తిరోగమనానికి నిదర్శనం. ఈ పరిస్థితులు మారాలంటే ప్రభుత్వ రంగాన్ని పటిష్టంగా నిర్వహించడమే మార్గం. సామ్రాజ్యవాద దోపిడికి వ్యతిరేకంగా, అత్యంత క్రూరమైన నియంతల అణచివేతలను ప్రతిఘటిస్తూ చైనా కమ్యూనిస్టు పార్టీ, ప్రజాసైన్యం చేసిన అశేష త్యాగాల, అపూర్వ పోరాటాల ఫలితం నవ చైనా. నాయకుల శుష్క ప్రసంగాలతో దేశం పురోగమించదు. ప్రజా చైతన్యం తోటే మార్పునకు దారి ఏర్పడుతుందని చాటిచెప్తోంది జన చైనా. వందేళ్ళ చైనా కమ్యూనిస్టు పార్టీకి జేజేలు.










