Feb 11,2021 00:05

ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సమక్షంలో వైసిపిలో చేరుతున్న టిడిపి నాయకులు

ఉనికి కోసం పాకులాడుతున్న చంద్రబాబు
- రామ సుబ్బారెడ్డి, కాటసాని రామిరెడ్డి
ప్రజాశక్తి -బనగానపల్లె: 
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై విశ్వాసం ఉండడంతో పంచాయతీ ఎన్నికల్లో వైసిపి మద్దతుతో పోటీ చేసిన మొదటి విడత 85 శాతం సర్పంచి అభ్యర్థులు విజయం సాధించినట్లు వైసిపి నంద్యాల పార్లమెంట్‌ పరిశీలకులు రామ సుబ్బారెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తెలిపారు. బుధవారం పట్టణంలోని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కులమతాలకు, పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టిడిపి నాయకులు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు వైసిపిపై నమ్మకంతో ఉన్నారని చెప్పారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయని, రాష్ట్రంలో గతంలో పంచాయతీ ఎన్నికల్లో ఘర్షణలు, రిగ్గింగ్‌ జరిగేవని తెలిపారు. తాము ఎన్నికలకు భయపడుతున్నట్లు టిడిపి నాయకులు తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. ప్రజలు రాష్ట్రంలో ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని, 2, 3, 4వ విడతల్లో వైసిపి మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో 102 పంచాయతీలు ఉంటే 46 ఏకగ్రీవమయ్యాయని, వీటిలో 41 వైసిపి మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. నియోజకవర్గం నుంచి అత్యధిక స్థానాలు వైసిపి మద్దతుదారులు ఏకగ్రీవం కావడంతో ఎమ్మెల్యే కాటసానిని రామసుబ్బారెడ్డి అభినందించారు. వైసిపి అధికార ప్రతినిధి సిద్ధం రెడ్డి రామ్మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు.
వైసిపిలోకి టిడిపి నాయకులు...
బనగానల్లె రూరల్‌ :
మండలంలోని రామతీర్థం గ్రామానికి చెందిన టిడిపి నాయకులు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సమక్షంలో వైసిపిలో చేరారు. పట్టణంలోని ఎమ్మెల్యే కాటసాని నివాసంలో మండలంలోని రామతీర్థం గ్రామానికి చెందిన టిడిపి నాయకులు దేవర కొత్తూరు, దేవర సుబ్బారావు, కావేటి మద్దిలేటి, కావేటి చిన్న సుంకన్న టిడిపిని వీడి ఎమ్మెల్యే కాటసాని సమక్షంలో వైసిపిలో చేరారు. వీరికి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి కులమతాలకు, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైసిపి మద్దతుతో పోటీ చేస్తున్న అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైసిపి నాయకులు సురేష్‌ నాయుడు, కాశీం, తిమ్మరాజు, రామ్మూర్తి పాల్గొన్నారు.
పెద్ద పెద్దయ్యను గెలిపించండి : ఎమ్మెల్యే
సంజామల :
మండలంలోని కానాల గ్రామంలో వైసిపి మద్దతుతో పోటీలో ఉన్న అభ్యర్థి పెద్ద పెద్దయ్య గెలిపించాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నాయకులను, కార్యకర్తలను కోరారు. పద్మావతి, ఫక్రుద్దీన్‌, పోచ నారాయణరెడ్డి, దస్తగిరి రెడ్డి, సుధాకర్‌రెడ్డి, బాల ముద్దు సాగర్‌ పాల్గొన్నారు.