Feb 14,2023 21:37

ఫొటో : నార్త్‌ మోపూరు దళిత వాడలో మాట్లాడుతున్న టిడిపి నేతలు

జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించుదాం
ప్రజాశక్తి-అల్లూరు : రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగిస్తున్న జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడమే ప్రజలందరి ప్రధాన లక్ష్యమని టిడిపి సీనియర్‌ నాయకుల బీద గిరిధర్‌, నెల్లూరు నిరంజన్‌ రెడ్డి వెల్లడించారు. మంగళవారం మండలంలోని నార్త్‌మోపూరు దళితవాడలో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో కరెంటు ఛార్జీలు, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువులు బాదుడే బాదుడంటూ చలోక్తులు విసిరారు. పరిపాలన చేతగాక ప్రజలపై అధిక పనులు వేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
పలువురు మహిళలు మాట్లాడుతూ నార్త్‌మోపూరు గ్రామాన్ని అల్లూరు నగర పంచాయతీలో విలీనం చేయడం కారణంగా పూర్తిగా ఉపాధి హామీ పనులు కోల్పోయామని అనేతల ముందు బోరున విలపించారు. అంతేకాకుండా 6 మాసాలకోసారి ఇంటి పన్నులు చెల్లించాలంటూ తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని వారికి విన్నవించారు. పక్కా గృహాలు నిర్మించుకునేందుకు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని తెలియజేశారు. ఆ నేతల స్పందిస్తూ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికీ పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని దళితులకు హామీనిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఈ గ్రామంలో ముమ్మరంగా సిమెంట్‌ రోడ్లు నిర్మించి అనేక మౌలిక వసతులు కల్పించామని టిడిపికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విడవలూరు దశరథ రామిరెడ్డి, రామిశెట్టి కృష్ణచైతన్య, అరగల రమణయ్య, కావలి కృష్ణ తదితరులు ఉన్నారు.