Dec 17,2021 08:39
  • జెన్‌కో, పవర్‌ డెవలప్‌మెంట్‌ సంస్థలకు కష్టాలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : జెన్‌కో, విద్యుత్‌ అభివృద్ధి సంస్థలు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయాయి. తీసుకున్న రుణాలను తీర్చలేని పరిస్థితికి చేరుకోవడంతో ఒకవైపు నిరర్ధక ఆస్తుల జాబితాలోకి, మరోవైపు డిఫాల్టర్‌ జాబితాలోకి చేరిపోతున్నాయి. దీనినుంచి ఎలా బయటపడాలో తెలియక అనునిత్యం వెసులుబాటుకోసం కేంద్రాన్ని, నిధుల కోసం రాష్ట్ర ఆర్థికశాఖను బతిమిలాడుకునే పరిస్థితికి చేరిపోయాయి. ఇప్పటికే ఒకసారి ఎన్‌పిఎ జాబితాలోకి చేరిపోయిన జెన్‌కో, విద్యుత్‌ అభివృద్ధి సంస్థలు రెండోసారి కూడా ఎన్‌పిఎలోకి చేరాయి. ఇదే సమయంలో డిఫాల్టర్‌ ముద్ర కూడా పడడంతో ఆ రెండు సంస్థలు దిక్కుతోచని స్థితికి చేరుకున్నాయి. పలు రేటింగ్‌ సంస్థల నివేదికల్లో రేటింగ్స్‌ను కోల్పోవడంతోపాటు, పవర్‌ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఇచ్చే వడ్డీ రాయితీని కోల్పోవాల్సి వచ్చిందని ఇంధనశాఖ అధికారి ఒకరు చెప్పారు. జెన్‌కో, పవర్‌ డెవలప్‌మెరట్‌ కార్పొరేషన్లు గత ఆగస్టు నుంచి ఇప్పటివరకు రూ.2,179 కోట్లు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, గ్రామీణ విద్యుదీకరణ సంస్థలకు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఓవర్‌డ్యూస్‌లపై చెల్లించాల్సిన అదనపు వడ్డీ రూ.51 కోట్లు కూడా ఉంది. ఈ సొమ్ములను చెల్లించడంలో జరుగుతున్న జాప్యం కారణంగా ఆర్‌ఇసి, పిఎఫ్‌సి సంస్థలు వరుస నోటీసులు జారీ చేస్తున్నాయి. కొన్ని రుణాలు గడువు దాటి ఓవర్‌డ్యూస్‌గా మారిపోవడం, ఆ పరిధి కూడా దాటిపోయి ఎన్‌పిఏలోకి చేరాయి. సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ వరకు గడువు దాటిన రుణాలు ఎన్‌పిఏలోకి చేరినట్లు పిఎఫ్‌సి, ఆర్‌ఇసి ప్రకటించాయి. ఈ రుణాలు చెల్లింపుల్లో జాప్యం వల్ల డిసెంబర్‌లో చెల్లించాల్సిన రుణాలు కూడా ఎన్‌పిఎలోకి చేరిపోనున్నాయి.ఇదే సమయంలో ప్రముఖ రేటింగ్‌ సంస్థలైన సిబిల్‌, క్రిసిల్‌ నివేదికల్లో కూడా డిఫాల్ట్‌గా నమోదు అవుతున్నాయి. ఇతర రుణాలు ఇచ్చిన బ్యాంకులు కూడా రుణ చెల్లింపులపై ఆరా తీస్తూ నివేదికలు కోరుతున్నాయి. ఈ నివేదికలపైనే కొత్తగా ఇచ్చే పెట్టుబడి రుణాలు ఆధారపడి ఉంటాయని బ్యాంకులు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. రుణాలు, చెల్లింపులపై రేటింగ్స్‌లో కూడా జెన్‌కో, పవర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్లు తిరోగమనంలో ఉన్నట్లు తేలింది. ప్రధానంగా బ్రిక్‌వర్క్స్‌ రేటింగ్స్‌ ఇండియా లిమిటెడ్‌ ఇచ్చిన రేటింగ్స్‌లో 2 రాష్ట్ర సంస్థల ఆర్ధిక వ్యవహారాలు తగ్గిపోయినట్లు తేలింది. గత మార్చి వరకు నిధుల అంశంలో బిబిబి రేటింగ్స్‌లో ఉన్న రాష్ట్ర సంస్థలు ఇప్పుడు సి కేటగిరీలోకి చేరిపోయినట్లు కనిపించింది. అలాగే నాన్‌ ఫండ్స్‌ విభాగంలో కూడా ఏ-2గా ఉన్న ఈ సంస్థలు ఇప్పుడు ఏ-4 కేటగిరీకి పడిపోయినట్లు తేలింది.
 

                                                           ప్రత్యేక వడ్డీ రాయితీ రద్దు

సకాలంలో చేసే చెల్లింపులపై లభించే ప్రత్యేక వడ్డీ రాయితీలను కూడా రాష్ట్ర సంస్థలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ వడ్డీ రాయితీలను పవర్‌ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఉపసంహరించుకున్నట్లు ఇంధనశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ వడ్డీ విలువ దాదాపు నాలుగున్నర కోట్లు ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇది చిన్న మొత్తమే అయినప్పటికీ, సంస్థలకు చెడ్డపేరు తెచ్చేదిగానే ఇతర అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.