Feb 13,2023 21:42

సమావేశంలో పాల్గొన్న నాయకులు

గోరంట్ల : పట్టణంలో శ్రీకృష్ణదేవరాయ జూనియర్‌ కళాశాలలో సోమవారం కళాశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్‌ పెద్దరాసు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ఇష్టపడి చదివితేనే ఉన్నత స్థాయికి వెళ్లగలరని తెలిపారు. ప్రణాళిక సిద్ధం చేసుకుని విద్యాభ్యాసాన్ని ప్రతి విద్యార్థి పూర్తి చేయాలన్నారు. అప్పుడే ఉన్నత శిఖరాలను అందుకోగలుగుతారన్నారు. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరినప్పుడు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చిన వారవుతారన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ విజయలక్ష్మి, ఎస్‌పివిఎం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ భక్తవత్సలం, అధ్యాపకులు లక్ష్మీనారాయణ, శంకర, బాలమోహన్‌, హరీష్‌, నందగోపాల్‌, లక్ష్మీ, గోవింద్‌ తదితరులు పాల్గొన్నారు.
నూతన విధానంతో విద్యా వ్యవస్థ నిర్వీర్యం : రాష్ట్ర ప్రభుత్వం తీసుకుచ్చిన నూతన విద్యా విధానంతో విద్యా వ్యవస్థ నిర్వీర్యముతోందనిఆదర్శ విద్యాసంస్థల అధినేత పెదరాసు సుబ్రహ్మణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలో ఎస్పీవీఎం డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ3.4.5 తరగతులు చదువుతున్న ప్రైమరీ విద్యార్థులు హై స్కూల్‌ లో చదువుకోవాలని నూతన పాలసీ ప్రభుత్వం తీసుకురావడం వలన గ్రామీణ ప్రాంతాల్లో ప్రైమరీ విద్యావ్యవస్థ నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రైమరీ స్కూల్‌ విద్యార్థులు చిన్న పిల్లలు హైస్కూల్‌ కి వెళ్లడానికి సుమారు 2 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందన్నారు. దీంతో డ్రాపౌట్స్‌ పెరిగే ప్రమాదం ఉందన్నారు. నూతన విద్యా విధానం వలన ప్రైవేట్‌ కళాశాలలు నడపడం కష్టంగా ఉందన్నారు రాష్ట్రంలో వేలాది ప్రైవేట్‌ పాఠశాలలు కళాశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడిందన్నారు.