కార్ఖానా (అనంతపురం) : ఇష్టం లేని పెళ్లి చూపులతో మానసిక ఒత్తిడికి గురై కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కార్ఖానా న్యూ వాసవినగర్‌లో చోటుచేసుకుంది. కార్ఖానా ఎస్‌ఐ నర్సింహులు వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా కదిరికి చెందిన లక్ష్మి కుటుంబం కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి, కార్ఖానా న్యూ వాసవినగర్‌లో నివసిస్తోంది. ఆమె కుమారుడు దండగల ఆంజనేయులు (25) ఎఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఆంజనేయులకి ఇష్టం లేకపోయినప్పటికీ ఇటీవల పెద్దల సమక్షంలో పెళ్లి చూపులు జరగడంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు. గత శుక్రవారం పింఛన్ తీసుకునేందుకు తల్లి స్వస్థలానికి వెళ్లింది. ఇంట్లో ఆంజనేయులు ఒక్కడే ఉన్నాడు. స్థానికంగా విక్రంపురి కాలనీలో ఉంటున్న అతని సోదరి శనివారం ఫోన్ చేయగా, నైట్ డ్యూటీ ఉందని చెప్పాడు. రాత్రి ఫోన్ చేయగా ఎంతకూ స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన సోదరి ఆదివారం ఉదయం వరసకు సోదరుడైన క్రాంతిని ఆంజనేయులు ఇంటికి పంపింది. ఎంతకీ తలుపులను తెరవకపోవడంతో.. అనుమానం వచ్చిన క్రాంతి స్థానికుల సాయంతో తలుపులను బద్దలుకొట్టి ఇంట్లోకి వెళ్లి చూశాడు. ఆంజనేయులు ఉరేసుకొని కనిపించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మఅతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.










