- విచారణ జరిపించాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీల డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైఎస్‌ఆర్ హెల్త్ విశ్వవిద్యాలయం రెండో విడత ఎంబిబిఎస్ కౌన్సెలింగ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించారని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు తెలిపారు. వైద్యకళాశాలల ఏర్పాటుపై వైసిపి సభ్యులు తోట త్రిమూర్తులు, దువ్వాడ శ్రీనివాస్, మొండితోక అరుణ్‌కుమార్ శాసనమండలిలో వైద్యారోగ్యశాఖ మంత్రిని బుధవారం ప్రశ్నించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం ఎస్‌సి, బిసి కేటగిరి సీట్లను కౌన్సెలింగ్‌లో భర్తీ చేయాలని చెప్పారు. అయితే ముందు ఓపెన్ కేటగిరి సీట్లను భర్తీ చేసిన తరువాత ఎస్‌సి, బిసి కేటగిరి సీట్లు భర్తీ చేశారని తెలిపారు. విశ్వవిద్యాలయం ఉపకులపతితో చర్చించి ఈ విధానాన్ని పున:సమీక్షించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. వైద్య కళాశాలల్లోని సీట్లను అమ్ముకోవడం సరికాదని అన్నారు. మెడికల్ సీట్ల కౌన్సెలింగ్‌పై వైద్యారోగ్యశాఖ మంత్రి రజిని నేరుగా సమాధానం చెప్పకుండా టిడిపి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. టిడిపి ప్రభుత్వం వైద్యకళాశాల ఏర్పాటు కోసం అసలు చర్యలు తీసుకోలేదన్నారు. మెడికల్ సీట్ల కౌన్సెలింగ్‌లో ఎలాంటి అవకతవకలు జరగలేదన్నారు. కళాశాల నిర్వహణ కోసం ఫీజులను ప్రవేశపెట్టామన్నారు.
- ఆర్‌టిసి స్థలాలను ప్రైవేటుకు అప్పగించొద్దు
ఆర్‌టిసి స్థలాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించొద్దని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ప్రజా రవాణా సంస్థ (ఆర్‌టిసి) భూముల లీజు, కొత్త బస్సుల కొనుగోలు అంశాలపై పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వరరావు, కెఎస్ లక్ష్మణరావు, షేక్ సాబ్జీ రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ను ప్రశ్నించారు. రాష్ట్రంలో 25 చోట్ల 22.68 ఎకరాలను వివిధ సంస్థలకు లీజుకు ఇచ్చిందని మంత్రి సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం సరికాదన్నారు. గ్రామాల్లో బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. అద్దె బస్సుల డ్రైవర్లకు పిఎఫ్, ఇఎస్‌ఐ అమలయ్యే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు. అద్దె బస్సులు తగ్గించి ప్రభుత్వం సొంత బస్సులు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్‌టిసి పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్న సిబ్బందిని కాంట్రాక్టు విధానంలో తీసుకురావాలని చెప్పారు. 30 నుంచి 50 ఏళ్లుపాటు స్థలాలను లీజుకు అప్పగించడం సరికాదని కెఎస్ లక్ష్మణరావు అభ్యంతరం వ్యక్తం చేశారు.
- కందిపప్పు ఇవ్వడంలేదు : వైసిపి ఎమ్మెల్సీ అరుణ్
తెల్లరేషన్ కార్డుదారులకు నాలుగు నెలలు నుంచి కందిపప్పు సక్రమంగా అందించడం లేదని వైసిపి ఎమ్మెల్సీ మొండితోక అరుణ్‌కుమార్ అన్నారు. సక్రమంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎండియు వాహనాలు అందించే రేషన్ కోసం కూలి పనులు మానుకుని వేచిచూడాల్సి వస్తోందని వైసిపి ఎమ్మెల్సీ జయమంగళం వెంకటరమణ అన్నారు. వాహనాలు కూడా ఇంటింటికీ వెళ్లడం లేదని చెప్పారు. ప్రజల్లో ప్లాస్టిక్ బియ్యంపై ఉన్న అపోహలను తొలగించాలని కోరారు.
- రోడ్ల మరమ్మతులపై పిడిఎఫ్ వాయిదా తీర్మానం
రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదారుల గురించి చర్చించాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు బుధవారం మండలిలో ఛైర్మన్ కె మోషేను రాజుకు వాయిదా తీర్మానం అందించారు. ఈ తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. మంగళవారం తను విజయవాడ నుంచి రామచంద్రాపురం వెళ్లానని, మండపేట, రామచంద్రాపురం ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల పరిస్థితి ఇలానే ఉందని చెప్పారు.










