న్యూఢిల్లీ: భువనేశ్వర్ వేదికగా ఇంటర్ కాంటినెంటల్ కప్ జూన్‌లో జరగనుంది. ఈ మేరకు ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్(ఎఐఎఫ్‌ఎఫ్) జనరల్ సెక్రటరీ షాజీ ప్రభాకరన్ బుధవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్‌ను సజావుగా నిర్వహించడంతో ఇంటర్ కాంటినెంటల్ కప్ ఆతిథ్య హక్కులు భారత్‌కు దక్కాయని ఆయన తెలిపారు. జూన్ 9నుంచి 18వరకు జరిగే ఈ టోర్నమెంట్‌లో ఆతిథ్య భారత్‌తోపాటు లెబనాన్, మంగోలియా, వనాటు దేశాలు ప్రాతినిధ్యం వహించనున్నాయి. ఇంటర్ కాంటినెంటల్ కప్‌కు భారత్ ఆతిథ్యమివ్వడం ఇది మూడోసారి. 2018లో ముంబయి, 2019లో అహ్మదాబాద్ వేదికగా జరిగింది. 2022లో కోల్‌కతా వేదికగా జరిగిన ముక్కోణపు ఫుట్‌బాల్ టోర్నీలో భారతజట్టు 1-2గోల్స్ తేడాతో ఆఫ్ఘనిస్తాన్, 0-4గోల్స్ తేడాతో హాంకాంగ్ చేతిలో ఓడింది. ఆ తర్వాత ఇంఫాల్ వేదికగా జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారతజట్టు 1-0గోల్స్ తేడాతో మయన్మార్‌పై, 2-0తో కిర్గిజ్ రిపబ్లిక్‌పై గెలిచింది.










