ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 700 వికెట్లు తీసిన మూడో భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. డోమినియాలో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అతడు ఈ ఘనతను సాధించాడు. తన స్పిన్ మాయాజాలంతో విండీస్ బ్యాటర్లకు చమటలు పట్టించాడు. అశ్విన్ ఐదు వికెట్లు పడగొట్టి విండీస్ ను కుప్పకూల్చాడు. టెస్టు క్రికెట్‌లో ఆర్ అశ్విన్ ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీయడం ఇది 33వ సారి. ఇంగ్లండ్ స్టార్ జేమ్స్ అండర్సన్ 32 సార్లు ఐదు వికెట్ల హాల్ అందుకున్నాడు. ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ (67), షేన్ వార్న్ (37), రిచర్డ్ హడ్లీ (36), అనిల్ కుంబ్లే (35), రంగనా హెరాత్ (34) ఉన్నారు. అంతేకాకుండా ప్రత్యర్థి బ్యాటర్లను బౌల్డ్ చేయడంలో కూడా అశ్విన్ రికార్డుకెక్కాడు. భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 94 సార్లు ప్రత్యర్థి బ్యాటర్లను బౌల్డ్ చేయగా.. అశ్విన్ 95 సార్లు ఈ ఫీట్ నమోదు చేశాడు. ఈ జాబితాలో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ (88), పేసర్ మహ్మద్ షమీ (66) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.










