Sep 02,2022 08:56
  • ఆగస్టులో అత్యధికంగా రూ.1.43 లక్షల కోట్ల వసూలు
  • కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడి

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలో సామాన్యులపై పనుు వసూళ్ల బాదుడుతో సామాన్యుడు విలలాడుతుండగా, సర్కార్‌ ఖజానా నిండుతోంది. ప్రతీ వస్తువుపై పన్నుల భారం మోపడంతో వస్తు సేవల పనుు (జిఎస్‌టి) వసూళ్లు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా ఆరో మాసంలోనూ రూ.1.40 లక్షల కోట్ల పైనా పన్ను వసూళ్లు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుత ఏడాది ఆగస్టులో రూ.1,43,612 కోట్ల జిఎస్‌టి వసూళ్లయ్యింది. జులై మాసంలోని రూ.1.49 లక్షల కోట్లతో పోల్చితే 4 శాతం తగ్గినప్పటికీ.. గతేడాది ఇదే ఆగస్టుతో పోల్చితే 28 శాతం పెరుగుదల నమోదైందని గురువారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన నెలలో సిజిఎస్‌టి కింద రూ.24,710 కోట్లు, ఎస్‌జిఎస్‌టి రూ.30,710 కోట్లు, ఐజిఎస్‌టి రూ.77,782 కోట్లు, సెస్‌ కింద రూ.10,168 కోట్లు చొప్పున వసూలైందని ఆర్థిక శాఖ వెల్లడించింది. గత ఐదు నెలల్లో జిఎస్‌టి వసూళ్లలో 33 శాతం పెరిగి రూ.7.46 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత నెలలో వివిధ రాష్ట్రాలతో పోలిస్తే పన్ను వసూళ్లలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌, మణిపూర్‌ దీవులు మినహా 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పన్ను వసూళ్లలో పెరుగుదల చోటు చేసుకుంది. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో మైనస్‌ 21 శాతం, లక్షద్వీప్‌లో 73 శాతం, మణిపూర్‌లో 22 శాతం జిఎస్‌టి వసూళ్లు పడిపోయాయి. మరోవైపు అరుణాచల్‌ ప్రదేశ్‌లో 11 శాతం, అసోంలో 10, జమ్ముకశ్మీర్‌లో 11 శాతం, రాజస్థాన్‌లో 10, సిక్కిం 13, తెలంగాణ 10 శాతం చొప్పున జిఎస్‌టి వసూళ్లు పెరిగాయి.