లబోదిబోమంటున్న ఉద్యాన పంటల రైతులు
142 ఎకరాలకు పైగా దెబ్బతిన్న పంటలు
నేలకొరిగిన మామిడి, అల్లనేరేడు, బొప్పాయి చెట్లు
గాలి బీభత్సానికి నేలమట్టమైన టమోటా
ప్రజాశక్తి-నిమ్మనపల్లి : రెండు రోజులుగా తీవ్ర గాలులు, వడగళ్ల వర్షం ప్రభావంతో మండలంలోని ఉద్యానవన పంటల రైతులు పంటలను నష్టపోయి ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర గాలులు, వడగల్లు సృష్టించిన బీభత్సానికి మండలంలోని రాచవేటివారిపల్లి, వెంగంవారిపల్లి, రెడ్డివారిపల్లి, నిమ్మనపల్లి గ్రామాలలో ఉద్యానవన పంటలను సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. పడమటి మండలాలలో ప్రధాన పంటలైన టమోటా, మామిడి, బొప్పాయ, అల్లనేరేడు వంటి ఉద్యాన పంటలు ప్రస్తుతం పూత, పిందే దశలో ఉండటంతో గురు, శుక్రవారాల్లో కురిసిన అకాల వర్షం ప్రభావంతో చెట్లు విరిగి నేలమట్టం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. అప్పులు చేసి పంటలను సాగు చేయటంతో, పూత, పిందె దశలోని పంటను ఒక్కసారిగా నష్టపోవటంతో రైతులు నష్టాల ఊబిలోకి కూరికిపోయారు. ప్రభుత్వం నష్టపరిహారాన్ని చెల్లించి తమను ఆదుకోవాలంటూ ఉద్యానవన పంటల రైతులు ప్రభుత్వం వైపు ఎదురుచూస్తున్నారు.
142 ఎకరాలల్లో దెబ్బతిన్న ఉద్యాన పంటలు
మండల పరిధిలో 142 ఎకరాలకు పైగా ఉద్యానవన పంటలు తీవ్ర గాలులు, వడగళ్లతో కూడిన అకాల వర్ష ప్రభావానికి చెట్లు విరిగి, పిందెలు రాలి, టమోటా మొక్కలు గాలికి కొట్టుకుపోవటంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. టమోటా 102 ఎకరాలు, బొప్పాయి 10, మామిడి 17, అల్లనేరేడు ఎకరా, బెండ 3, బీర 2, దోస కర్బూజ 6, కాకర ఒక ఎకరాలో నష్టం వాటిలింది. పంట దిగుబడి దశలో ఉన్న సమయంలో అకాల వర్షం కారణంగా పంట నష్టం వాటిల్లడంతో రైతులు కోలుకోలేని దుస్థితిలోకి వెళ్లిపోయారు.
రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
అకాల వర్షం కారణంగా నష్టపోయిన ఉద్యానవన పంటల రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి వారిని ఆదుకోవాలి. అప్పులు చేసి పంటలను సాగు చేయటంతో అకాల వర్షం కారణంగా దిగుబడి దశలోనే ఉద్యానవన పంటలు నేలమట్టం కావడంతో తీవ్రంగా నష్టపోయాం. పంట నష్టాన్ని గుర్తించి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.
- అక్కల రమణారెడ్డి, రైతు, రాచవేటివారిపల్లి
ప్రభుత్వం దృష్టికి పంట నష్టం
మండలంలో అకాల వర్షంతో దెబ్బతిన్న పంట నష్టం వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ప్రధానంగా వ్యవసాయ పంటలతో పాటు, ఉద్యానవన పంటలను రైతులు సాగు చేస్తున్నారు. రెండు రోజులగా గాలి, వాన, వడగళ్ల బీభత్సం, అకాల వర్షం ప్రభావంతో మామిడి, టమోటా, బొప్పాయ, అల్లనేరేడు, బీర, బెండ వంటి పంటలకు 142 ఎకరాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని గుర్తించాం. ప్రస్తుతం మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ నష్టం వాటిల్లిన పంటలను గుర్తించి, పూర్తి నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవటానికి కృషి చేస్తాం.
- ఈశ్వర్ ప్రసాద్‌రెడ్డి, ఉద్యానవన శాఖాధికారి. నిమ్మనపల్లి.
215 ఎకరాల్లో పంటలకు నష్టం
మదనపల్లె అర్బన్ : నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షాలకు, వడగళ్లు తోడవడంతో 215 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లింది. వడగళ్ల వర్షానికి సుమారు 195 ఎకరాల్లో టమోటా, 10 ఎకరాల్లో అల్లనేరేడు, 8 ఎకరాల్లో మామిడి, 5 ఎకరాల్లో కూరగాయలు పంటలు దెబ్బతిన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పెద్దఎత్తున గాలి వాన కురడం, వడగళ్లు పడటంతో పూలు, పండ్లు తోటలు, దెబ్బతిన్నాయి. మదనపల్లి పట్టణంలోనూ పెద్ద ఎత్తున రెండు రోజులు వడగళ్లు వర్షం తీవ్ర ప్రభావం చూపించింది. వర్షానికి చింతకాయలు నేలరాలాయి. పంటల నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపించి, రైతులకు ఆర్థిక సాయం అందేవిధంగా చర్యలు తీసుకుంటామని ఉద్యానవన శాఖ అధికారి ఈశ్వర్‌ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.










