Mar 17,2023 20:36

- బహిరంగ సభలో మాట్లాడుతున్న నారా లోకేష్‌


రాష్ట్రంలో సైకో పాలన నడుస్తోంది
ఎమ్మెల్సీల గెలుపుతోనే వైసిపికి రోజులు దగ్గరపడ్డాయి
పాదయాత్రలో నారా లోకేష్‌
ప్రజాశక్తి-ములకలచెరువు : వైసిపి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగి వేసారి పోతున్న రాష్ట్ర ప్రజలు ప్రభుత్వంపై పూర్తిస్థాయిలో వ్యతిరేకత చూపు తున్నారని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సైకోలా వ్యవహరిస్తున్నారని, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపుతోనే వైసిపికి రోజులు దగ్గరపడ్డాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. యువగళం పేరుతో లోకేష్‌ చేపట్టిన పాదయాత్ర 45వ రోజుకు చేరుకుంది. శుక్రవారం అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోట మండలం నుంచి మొలకలచెరువు మండలంలోని కమ్మపల్లి నుంచి ప్రారంభమైన పాదయాత్ర పులికల్లు, ములకలచెరువు వరకూ పాదయాత్ర సాగుగింది. ఆయా ప్రాంతాల్లో స్థానికులతో మాటామంతి నిర్వహించారు. పాదయాత్ర సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో లోకేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల్లో చైతన్యం నింపేందుకే కుప్పం నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టి అన్ని నియోజకవర్గాలలో పర్యటిస్తూ నాలుగువేల కిలోమీటర్లు యువగళం పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రజలకు ఎన్నో అబద్ధపు వాగ్ధానాలు చేసిన జగన్మోహన్‌ రెడ్డి, ముఖ్యమంత్రి అయ్యాక వాటిని పక్కన పెట్టి ప్రజలను మోసం చేశారన్నారు. ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, రాష్ట్రంలో తాళిబన్‌ల పరిపాలన కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి అయిన వారం రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగుల సిపిఎస్‌ రద్దు చేస్తానని హామీ ఇచ్చి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా వాటి గురించి పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం నిషేధం అమలు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కల్తీ మద్యాన్ని అమ్ముతూ సొమ్ము చేసుకుం టున్నారన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లకు ఉన్న కార్పొరేషన్లు పూర్తిగా తొలగించి వారికి అన్యాయం చేయడం జరిగిందన్నారు. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ నిరుపేదలకు పింఛన్‌ సరఫరా చేస్తానని హామీ ఇచ్చి ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. ఉన్న పాఠశాలలను కూడా మూసివేస్తూ, విదేశీ విద్య కూడా రద్దు చేసిన ఘనత జగన్మోహన్‌ రెడ్డికి దక్కిందన్నారు. ఎన్నికల ముందు రైతులు పండించిన పంటలను ప్రభుత్వం గిట్టు బాటు ధరలో కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చి, వాటిని కొనుగోలు చేసే పనులు పక్కనపెట్టి రైతుల బోర్లకు మీటర్లు బిగించే పనులు చేస్తూ రైతులను ఇబ్బందులు పాలు చేస్తున్నట్టు తెలిపారు. రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగన్మోహన్‌రెడ్డి హంద్రీ-నీవా, గాలేరు కాలువ పనులను ఇంతవరకు పూర్తి చేయలేక ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానని, ఎందుకు సంబంధించి ప్రతి సంవత్సరం ఉద్యోగాల క్యాలెండర్‌ ను విడుదల చేస్తానని రాష్ట్రంలోని నిరుద్యోగులను నమ్మించి, నాలుగు సంవత్సరాలు అయినా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. ఉన్న పరిశ్రమలను పక్క రాష్ట్రాలకు తరిమికొడుతూ రాష్ట్రంలో మరింత నిరుద్యోగత పెంచుతూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వంపై ప్రశ్నించిన వారిపై పోలీసుల ద్వారా కేసులు పెట్టడం, గుండాల ద్వారా దాడులు చేయడం, భూ కబ్జాలు, ఇసుక దందాలు పెట్రేగిపోయాయన్నారు. ప్రజల ధనాన్ని దోచుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకెళ్లారన్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో కురబలకోట, అంగళ్లు ప్రాంతంలో పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రభుత్వ భూములు వందల ఎకరాలు, వేలకోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వం భూములను ఆక్రమించుకు న్నారన్నారు. తంబళ్లపల్లి మల్లయ్య కొండ దేవాలయంలో ఉన్న మూల విగ్రహాన్ని ఏం చేశారు, అది ఎక్కడుంది అని ప్రశ్నించారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో శాసనసభ్యులుగా గెలిపిస్తే, నియోజకవర్గాన్ని అభివ ద్ధి చేయాల్సింది పోయి, నియోజకవర్గంలో ఉన్న సంపదను దోచుకుంటున్నట్లు తెలిపారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలపై తిరుగు బాటు చేసిన తంబళ్లపల్లి మండలం వైకాపా పార్టీ జడ్పిటిసి భర్త కొండ్రెడ్డిని జిల్లా బహిష్కరణకు గురి చేశారన్నారు. అన్ని హంగులున్న మదనపల్లి ని జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సి ఉండగా పెద్దిరెడ్డి కుటుంబం స్వలాభం కోసం, మారు మూలున్న రాయచోటిని జిల్లా కేంద్రంలోకి మళ్లించారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లా కేంద్రంగా చేస్తామని హామీ ఇచ్చారు. పాలు విసిరిన సవాల్‌ పై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధమేనన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీనీవా పనులు పూర్తి చేస్తామని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, మదన పల్లి టమోటా మార్కెట్ను దత్తత తీసుకొని, మార్కెట్ను అభివృద్ధి చేస్తానని తెలి పారు. రాష్ట్రంలో పరిశ్రమలను తీసుకొచ్చి నిరుద్యోగతనం తగ్గించేందుకు కృషి చేస్తానన్నారు. అరాచక పాలన సాగిస్తున్న వైకాపా పార్టీని గద్దదించాలని ప్రజ లను కోరారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాబోయే రోజుల్లో పార్టీ గెలుపు కోసం, భయపడకుండా శ్రమించి పార్టీని గెలిపించాలని కోరారు. అనంతరం ముల కలచెరువు నుంచి ఉమ్మడి అనంతపురం జిల్లాలోని చీకటిమానపల్లి మీదుగా పాదయాత్ర కొనసాగించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌, టిడిపి పార్టీ నాయకులు గంటా నరహరి, కొల్లు రవీంద్ర, బీసీ సెల్‌ రాష్ట్ర నాయకులు గుత్తికొండ త్యాగరాజు, రాష్ట్ర తెలుగు మహిళా నాయకులు పర్వీన్‌తాజ్‌, జడ్పిటిసి కువైట్‌ శంకర్‌, మండల అధ్యక్షులు సిద్ధప్ప, ఉపాధ్యక్షులు వెంకటస్వామి, కెవి రమణ, మౌలా, భజంత్రీ రామానుజులు, కేశవులు, చిన్న కృష్ణ, కట్టహరి, నరసింహారెడ్డి, సుబ్బి నాయుడు, విజరు కుమార్‌, రెడ్డప్ప, శ్రీనివాసులు, సోము, గంగాదేవి పాల్గొన్నారు.