Mar 18,2023 20:10

కల్యాణోత్సవ ఏర్పాట్లను పరిశీలిస్తున్న జెఇఒ వీరబ్రహ్మం

టిటిడి జెఇఒ వీరబ్రహ్మం
ప్రజాశక్తి-ఒంటిమిట్ట : ఏప్రిల్‌ 5న శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా కల్యాణ వేదికను సుందరంగా తీర్చిదిద్దాలని టిటిడి జెఇఒ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. పేర్కొన్నారు. శనివారం ఆయన కల్యాణ వేదిక వద్ద నిర్వహిస్తున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జెఇఒ మాట్లాడుతూ కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న ఇంజినీరింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రాంగణమంతా సుందరంగా తీర్చీదిద్ధాలన్నారు. లక్షలాదిగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కల్యాణం రోజున అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ, తలంబ్రాలు పంపిణీ చేయాలన్నారు. ఆలయం, పరిసర ప్రాంతాలలో తగినన్ని తాత్కాలిక, మొబైల్‌ మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పరిశుభ్రత, పారిశుధ్యం నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. వాహనాల పార్కింగ్‌ స్థలాలను అభివద్ధి చేయాలన్నారు. అనంతరం అధికారులతో కలిసి కల్యాణ వేదిక, ముఖ్యమంత్రి విడిది చేసే భవనం, ,ఆలయ పరిసరాలు, పుష్కరిణి, వాహన మండపం, అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.