ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్ : పేదల ఇళ్లు మునకకు కారణమైన భూ కబ్జాదారుడు సుధాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అకాల వర్షాల కారణంగా అమ్మచెరువుమిట్ట వెనుక వైపున ఉన్న బృందావనం కాలనీలో ఇళ్లు మునిగిపోయిన ప్రాంతాల్ని శనివారం సిపిఎం బృందం పర్యటించి సమస్యలు తెలుసుకుంది. మదనపల్లె తహశీల్దార్, ఆర్‌డిఒలకు ఫోన్ ద్వారా ఇళ్ల మునకపై సమాచారం అందించి, బాదితులను ఆదుకోవాలని, భూ కబ్జాలకు పాల్పడిన సుధాకర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ కోళ్లబైలు రెవెన్యూ గ్రామం సర్వేనెంబర్ 671, 539, 529, 531 సర్వే నంబర్లలో భూములు కబ్జాకు పాల్పడుతున్న సుధాకర్‌రెడ్డి, రోడ్డు ఏర్పాటు చేసే పేరుతో ఎత్తుగా చదును చేసుకోవడం కారణంగా బృందావనం కాలనీ లోతట్టు ప్రాంతంగా మారిందని తెలిపారు. ఈ కారణంతోనే శుక్రవారం పడిన కొద్దిపాటి వర్షానికి ఇళ్లలోకి నీళ్లు చేరిపోయి పేదల తీవ్రమైన అవస్థలు పడ్డారన్నారు. కబ్జాలు అరికట్టి ప్రభుత్వ భూములు కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు భూకబ్జాదారులకే వంత పాడటం శోచనీయమన్నారు. ఇళ్లు మునిగిపోయి అవస్థలు పడుతున్న పేదలను ఆదుకోవాల్సిన ప్రభుత్వ అధికారులు గానీ, ప్రభుత్వ పెద్దలు గానీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతూ భూకబ్జాలకు చట్టబద్ధం చేస్తున్న రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ అధికారులు స్పందించి అకాల వర్షానికి నష్టపోయిన పేదలను ఆదుకోవాలని, ఇందుకు కారణమైన భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు హరిశర్మ స్థానిక ప్రజలు ఆబిద్, ధనంజయ, నందిని, రమణ, ఖాదర్ పాల్గొన్నారు.










