80 ఎకరాల్లో దెబ్బతిన్న ఉద్యానవన పంటలు
ఈదురు గాలులకు నేలకొరిగిన టమోటా, మామిడి
నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్న అధికారులు
ప్రజాశక్తి-నిమ్మనపల్లి : గాలి వాన బీభత్సానికి జిల్లాలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. తీవ్ర గాలులు, వడగళ్లతో కూడిన అకాల వర్షం ప్రభావంతో ఉద్యానవన పంటలు దెబ్బ తినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతుల సాగు చేసిన మామిడి, టమోటా, బొప్పాయి తోటలు గాలుల ప్రభావానికి విరిగి, నేలవాలి రైతులకు నష్టాన్ని మిగిల్చాయి. రాత్రి వేళలో తీవ్ర గాలుల ప్రభావంతో కురిసిన వడగళ్లతో కూడిన అకాల వర్షానికి, మండల వ్యాప్తంగా 80 ఎకరాలకి పైగా ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. 66 ఎకరాల్లో టమోటా, ఆరు ఎకరాల్లో బొప్పాయి, మామిడి మూడు, మిరప రెండు, బెండ మూడు ఎకరాలలో వడగళ్ల వర్షానికి పూర్తిగా దెబ్బతిన్నాయి. పూత దశలోని టమోటా, పూత, పిందె దశలోని మామిడి చెట్లు గాలుల ప్రభావానికి పూర్తిగా విరిగిపడ్డాయి. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఉద్యానవన శాఖాధికారులు, రైతు భరోసా కేంద్రంలోని సిబ్బంది అకాల వర్ష ప్రభావంతో దెబ్బతిన్న పంటలను గుర్తించి ప్రభుత్వానికి నివేదికను పంపుతున్నట్లు మండల ఉద్యానవన శాఖాధికారి ఈశ్వర్ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించి పూర్తి నివేదికను ప్రభుత్వం దృష్టికి పంపుతామన్నారు.
వాల్మీకిపురం :గురువారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి పంటలు నష్టపోయామని మండలంలోని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో రైతులు పండించిన టమోటా, బొప్పాయి, మిరప తదితర పంటలు దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు. మండల వ్యాప్తంగా దాదాపు 40 ఎకరాల పంట నష్టం వాటిల్లినట్లు రైతుల అంచనా. పంట నష్టాలను అంచనా వేయాల్సిన అధికారులు, రైతు భరోసా కేంద్రం సిబ్బంది నిద్రమత్తులో జోగుతుండడంతో రైతులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని ప్యారంపల్లి, ఫత్తేపురం, ఓబులంపల్లి, జర్రావారిపల్లి తదితర ప్రాంతాల్లో రైతులకు పంట నష్టం వాటిల్లింది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు నాగార్జున, మహేష్ రెడ్డి, రామక్రిష్ణ, శ్రీనివాసులు రెడ్డి, నరసింహులు, వెంకట్రమణ రెడ్డి, సురేంద్ర రెడ్డి, వెంకట్రమణ, ఆనంద రెడ్డి తదితరులు కోరారు. అలాగే విద్యుత్ తీగలపై చెట్లు విరిగిపడడంతో ప్యారంపల్లి, శివపురం, ఓబులంపల్లి, నల్లంవాండ్లపల్లి గ్రామాల్లో గురువారం సాయంత్రం 6గంటల నుంచి విద్యుత్ లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విద్యుత్‌శాఖ ఏఈ జాకీర్ ఆధ్వర్యంలో సిబ్బంది విద్యుత్ పనులు చేపట్టారు.










