ప్రజాశక్తి-మదనపల్లె : మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్, మదనపల్లె నందు కళాశాలలోని యెన్.ఎస్.ఎస్ విభాగము వారు "వరల్డ్ వాటర్ డే - ప్రపంచ జల దినోత్సవం" ను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రామనాథన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భూగర్భ జలాల ప్రాముఖ్యతపై దృష్టి సారించి, వాటి పై ప్రతి ఒక్కరికి అవగహన పెంచాలని అన్నారు. ప్రపంచంలోని మంచినీళ్లు దాదాపు భూగర్భ జలాలే. ఐరాస అంచనా ప్రకారం.. ప్రపంచంలోని 2.2 బిలియన్ల మంది ప్రజలు సురక్షితమైన నీరు అందుబాటులో లేకుండానే జీవిస్తున్నారు అని అన్నారు. ఈ నేపథ్యంలో 2030 నాటికి ప్రతీ ఒక్కరికీ పరిశుభ్రమైన నీటిని అందజేయడమే లక్ష్యంగా ఐరాస పెట్టుకుంది అని అన్నారు. జీవం నీటితో మొదలైంది అని, ప్రకృతి నీటితోనే నడుస్తోంది అని, అభివృద్ధి జరగాలంటే నీటి వనరులు కావాలి, జీవవైవిధ్య రక్షణ, జీవం నీటితోనే సాధ్యమవుతుంది అని అన్నారు. కానీ నీటిని వృధా చేస్తూ కలుషితం చేసి విషతుల్యంగా మార్చేస్తున్నాం. ప్రపంచంలో కోట్లాది మంది తాగడానికి నీరు లేక దాహంతో అల్లాడిపోతుంటే, ఉన్న నీటిని వృధాగా నేల పాలు చేస్తున్నాం. నీటి వనరులను వ్యర్థాలతో కలుషితం చేసి తాగడానికి వీల్లేని విధంగా తయారుచేస్తున్నాం అని అన్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి మనం బయటకు రావాలని, అందరికి భూగర్భ జలాల ప్రాముఖ్యత గురుంచి తెలియజేసేలా ప్రతి విద్యార్ధి తయారు అవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమం లో కళాశాల యెన్.ఎస్.ఎస్ కో ఆర్డినేటర్ రాజేష్, కెమిస్ట్రీ విభాగాధిపతి డాక్టర్ బాలాజీ రామానుజన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.










