Mar 27,2023 21:05

పుస్తకాలు పంపిణీ చేస్తున్న బత్యాల

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బాబారు వివేకానందరెడ్డి హత్య కేసులో దోషులను సిబిఐ బయటపెట్టిందని, వారికి వెంటనే శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్రాయులు డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన టిడిపి శ్రేణులతో కలిసి మార్కెట్‌, బండ్రాళ్ల వీధి తదితర ప్రాంతాలలో పర్యటించి వివేకానందరెడ్డి హత్య కేసుపై ముద్రించిన 'జగనాసుర రక్త చరిత్ర' పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బత్యాల మాట్లాడుతూ గతంలో రాష్ట్ర పోలీసులపై విశ్వాసం లేదని, విచారణకు సిబిఐని కోరిన జగన్‌ బాబారు కేసులో సిబిఐ అవసరం లేదని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ఆరు సార్లు ఎంపీగా, నాలుగు దఫాలు ఎమ్మెల్యేగానూ, ఒకమారు ఎమ్మెల్సీగా రాష్ట్రానికి సేవలందించి ప్రజాభిమానాన్ని చూరగొన్న వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేసినా నిందితులను పట్టుకోవడంలో ప్రభుత్వం జాప్యం చేస్తూ ధోషులను వెనకేసుకురావడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయిన వివేకా కుమార్తె సునీత హైకోర్టు ద్వారా సిబిఐని ఆశ్రయించి న్యాయం కోసం పోరాడుతుంటే దోషులను తప్పించేందుకు జగన్‌ ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని విమర్శించారు. దోషులకు శిక్ష పడేలా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టకపోతే హత్య కేసులో జగన్‌ ప్రమేయం కూడా ఉందని అనుమానించాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.