ప్రజాశక్తి-చాపాడు
ఆధునిక వెదురు ఉత్పత్తుల తయారీకి మైదుకూరులోని మార్కెట్ యార్డ్ ఆవరణం వేదికగా మారింది. వెదురు ఉత్పత్తి దారులకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వెదురు వృత్తిదారుల సంక్షేమ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మేదర వృత్తి కలవారికి అవగాహన కల్పించి వివిధ రకాల వెదురు ఉత్పత్తులను సిద్ధం చేయిస్తున్నారు. వెదురు ఉత్పత్తులను త్వరలో గ్రీన్ సిటీ విశాఖలో జరగబోయే పర్యావరణ జి-20 సదస్సులో ఫ్లవర్ వాజ్‌లు, రోడ్ల వెంబడి అలంకరణకు ఈ వెదురు ఉత్పత్తులను వినియోగించనున్నట్లు తెలుస్తున్నది. రాయచోటి, మదనపల్లె, మైదుకూరు ప్రాంతానికి చెందిన వెదురు ఉత్పత్తిదారులను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేయిస్తున్నారు. ఫ్లవర్ వాజ్‌లు, రోడ్డు వెంబడి అలంకరణకు ఉపయోగపడే డ్రమ్ములు, గంపలు సిద్ధం చేయించి వాటికి రంగులు వేయిస్తున్నారు. వెదురు ఉత్పత్తులు తయారు చేసిన కళాకారులకు రోజువారి వేతనంతో పాటు సర్టిఫికెట్ అందజేస్తున్నారు. బాంబో మిషన్ వెదురు ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ మేదర వృత్తిపై ఆధారపడే వారిని గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వెదురు ఉత్పత్తులను ఉపయోగించడం వలన ప్లాస్టిక్ వలన కలిగే నష్టాలను తగ్గించుకోవచ్చు. దీని ద్వారా వెదురు ఉత్పత్తిదారులకు ఆదరణ లభిస్తున్నది. పర్యావరణ జి-20 సదస్సుకు మైదుకూరు నుంచి వెయ్యి వెదురు ఉత్పత్తులను సిద్ధం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
శిక్షణ ఉపయోగకరంగా ఉంది
గత ఎన్నో ఏళ్లుగా వెదురు ఉత్పత్తులను తయారు చేస్తున్నాం. మార్కెటింగ్‌పై అవగాహన లేకపోవడంతో తక్కువ ధరలకే ఉత్పత్తులను అమ్ము కునే వాళ్ళం. ఆధునిక వెదురు ఉత్పత్తులపై నైపుణ్య శిక్షణ ఇస్తుండటం వలన ఉపయోగకరంగా ఉంది. రోజుకు రూ.1500 వరకు ఉపాధి అందు తుంది. శిక్షణలో వివిధ రకాల భిన్న ఉత్పత్తులు సిద్ధం చేసే అవగాహన కల్పించారు.
- రామయ్య, వెదురు కార్మికుడు.
ఆధునిక ఉత్పత్తులపై శిక్షణ
ఆధునిక వెదురు ఉత్పత్తులపై శిక్షణ ఇస్తూ నైపుణ్యతను పెంచే ప్రయత్నం చేస్తున్నాం. గతంలో వెదురుతో వివిధ రకాల వ్యవసాయ ఉపయోగ పదార్థాలను తయారు చేసేవారు. వారికి కొంత శిక్షణ ఇచ్చి అలంకరణ పదార్థాలు చేయి స్తున్నాం. జి-20 సదస్సుకు వెదురు ఉత్పత్తులను సిద్ధం చేయిస్తున్నాం. శిక్షణతో పాటు ఉపాధి, మార్కె టింగ్ అవకాశాన్ని కల్పిస్తున్నాం.
- రాఘవేంద్ర, ఎన్‌జిఒ ప్రెసిడెంట్.










