నిద్రలో ఉన్నాను..!
నా ఇల్లు మాయమైపోయింది
నాగరికత నడి బొడ్డున కట్టుకున్న
నా మొట్ట మొదటి ఇల్లు
కనుమరుగైపోయింది
గరుకు గోడల మీద చెక్కిన ఆనవాళ్లు మాత్రమే
గుర్తుగా మిగిలాయి
రాతి చక్రాల బండి మీద అంతర్వాహిని
ప్రవహిస్తూ వెళ్ళిపోయింది
మా తాత చేతిలో పండిన నిప్పుతో
ప్రపంచం ప్రజ్వరిల్లింది
కళ్ళతో వేట వేళ్లే ఆయుధాలు
ఏ దేశపు జాతీయ మృగమైనా
మా ఇంటి కూర దాకలో
మూడు రోజులు కూరలాగా మారిపోయేది
వేల కన్నుల వయ్యారి నెమలి
మా ఇంటి ముఖచిత్రం
ఏ జాతి పూవు ఈ ఇంటి పెరట్లో వాడిపోనేలేదు
అంత అందమైన మా ఇల్లు
ఉన్నట్టుండి మాయమైంది!
ఇల్లంటే ఏ ఒక్కరిదో కాదు
తరతరాల సమూహాలది
చెట్టుమీద కట్టుకున్న ఆదివాసీ మంచె
మంచులో కరిగిపోని ఇగ్లూ
ఆఫ్ఘన్ ఎడారిలో ఇసుక గూడు
శ్రీలంక బౌద్ధ ఆరామం
ధారావిలో పట్టాలతో కట్టిన పరంజా
పందులూ పిల్లలు కలిసి ఉండే
మురికివాడలోని గుడిసె
చిమ్మ చీకటి ఊహలో ఇనుప పుల్లతో
చిత్రకళని వెలిగించిన అజంతా గుహ
సనాతనానికి నాగరికత నేర్పిన
మన ఇల్లు కూలిపోయింది!
పీఠభూముల కింద అసలు చరిత్రలు కప్పబడినాక
పునాదులు లేని మేడల మీద
రంగురంగుల వలస జెండాలు ఎగురుతున్నాయి
రాతి శాసనాల మర్మాల మెలికల్లో
తెగిపడిన మూలవాసుల కంఠాల సంఖ్య
లెక్కలోకి రానే రాదు
తెలుపు రంగు ఈ దేశాన్ని పట్టి పీడిస్తుంది
వర్ణాల దండయాత్రలో విరిగిపడి
ఈమట్టిలో కల్సిపోయిన
ద్రావిడ కోటల్ని కలగంటున్నాను
కూలిపోయిన ఇంటి స్థానంలో
సరికొత్త దేశాన్ని కోరుకుంటున్నాను!
- అనిల్ డ్యాని, 97033 36688










