Mar 29,2023 14:53

ప్రజాశక్తి-పీలేరు: కాంగ్రెస్ కంచు కోటల్ని బద్దలు కొట్టిన ధీశాలి నందమూరి తారక రామారావు అని టిడిపి నాయకులు తెలిపారు. బుధవారం పీలేరు నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దివంగత ఎన్టీఆర్ చిత్రపఠానికిపూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిడిపి శ్రేణులు మాట్లాడుతూ, ఆయనకు రాజకీయ వారసత్వం లేదు, దేశాన్ని ఏలిన చరిత్రా లేదు, రాజకీయ అనుభవం అస్సలు లేదు. అయినా రాజకీయ పార్టీని ప్రారంభించి, దానికి తెలుగుదేశంపార్టీ అని పేరు పెట్టి, పార్టీ ప్రారంభించిన  తొమ్మిది నెలలకే డిల్లీ కంచు కోటను బద్దలు కొట్టిన యుగపురుషుడు నందమూరి తారకరామారావు అని అన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోరి  తాను వస్తున్నానంటూ ప్రకటించిన ఎన్టీఆర్ కు ఊరూ, వాడా బ్రహ్మరథం పట్టి, హారతులిచ్చారు. నాయకుడు ఎక్కడి నుంచో కాదు, జనంలోంచే పుట్టుకు వస్తాడన్న వాస్తవాన్ని రుజువు చేశారు. తెలుగు వారు మద్రాసీయులు అనే రోజుల్లో నేను తెలుగు వాణ్ణి అంటూ తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ అతి తక్కువ కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 35లోక్ సభ స్థానాలు, 202అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకొని తెలుగోడి సత్తా చాటి, తెలుగుదేశం పార్టీ జెండాను ఢిల్లీ పురవీధుల్లో రెపరెప లాడించి, తెలుగు ప్రజల శాశ్వత చిరునామాగా నిలిచారు  అన్న ఎన్టీఆర్ అని గుర్తు చేశారు.