రాజంపేట అర్బన్ : జిల్లాని టిబి రహిత జిల్లాగా తీర్చిదిద్దుదామని కలెక్టర్ గిరీష అన్నారు. మంగళవారం రాజంపేటలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో టిడి వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహార కిట్లను అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ మాట్లాడుతూ టిబి వ్యాధి వస్తే ఇంట్లో వాళ్లు కూడా దూరం పెట్టే పరిస్థితి ఉందని వారిని దగ్గరకు రానివ్వరని, అటువంటి పరిస్థితిని రూపుమాపడానికి ప్రధానమంత్రి 2025 నాటికి టిబి లేని భారతాన్ని నిర్మించడానికి టిబి ముక్త్ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. టిబి వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారాన్ని ఇవ్వడం వారిని దత్తత తీసుకోవడం వంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయన్నారు. రోటరీ క్లబ్ అన్నమయ్య వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చాలా అభినందనీయమన్నారు. అన్నమయ్య జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు దాదాపు 750 మంది టిబి వ్యాధిగ్రస్తులకు పైగా దత్తత తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లా అధికారులందరూ కూడా కొంతమంది టిబి వ్యాధిగ్రస్తులను దత్తత తీసుకున్నారన్నారు. ప్రజా ప్రతినిధులు, ఎన్జీవోలు, ప్రజలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. రాజంపేట సబ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ టిబి వ్యాధిగ్రస్తులను మిగిలిన వారి లాగానే ట్రీట్ చేయాలని, వారిని దూరం పెట్టవద్దని సూచించారు. ఉమ్మడి కడప జిల్లా జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో టిబి వస్తే మనిషి చనిపోయే పరిస్థితి ఉండేదని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. అనంతరం లబ్ధిదారులందరికీ పౌష్టికాహార కిట్లను అందించారు. కార్యక్రమంలో రాజంపేటకు సంబంధించిన వివిధ ప్రజాప్రతినిధులు, డిఎంహెచ్‌ఒ డాక్టర్ కొండయ్య, ఆరోగ్య అధికారులు ఎఎన్‌ఎంలు పాల్గొన్నారు










