Sep 26,2022 07:52

వీధి బడి
నాకు ఇంకా గుర్తే
మనసుకి ఊహలు మొలిచి
బడిబాట పట్టిన తొలి రోజుల్లో
చేతులు పలపుల్లల కోసం
ఎంత ఆత్రుతగా ఎదురుచూసేవో!
అవి నోట్లోనే కరిగేవో?
దిద్దడంతోనే అరిగేవో?!
చిరుగుల పంట్లాం
చిల్లుల్లోంచే జారిపడేవో తెలీదు కానీ,
రోజుకో కనికి మాత్రం మాయమైపోయేది
మట్టి పలక బీటలు వాడినప్పుడల్లా
వీపు విమానం మోతెక్కేది
ఎంత లేదన్నా
నాలుగైదు పలకల పగిలితేనే
అక్షరాలు చేతికి తిరిగేవి
గబగబా అక్షర యజ్ఞాన్ని పూర్తి చేసేసి
అచ్చు పుస్తకాలు తిరగేయాలని
మనసెంత ఉవ్విళ్ళూరేదో?
అర్ధ సంవత్సరం పూర్తయ్యాక
గుణింత పదాలు వచ్చాక
పాఠ్య పుస్తకం పట్టడం...
జీవితం సాధించిన మొట్టమొదటి విజయం
పుటలు తెరవగానే గుప్పుమన్న
కొత్త పుస్తక సువాసనలు గుర్తొస్తే
ఇప్పటికీ మనసంతా పరిమళ తుళ్ళింతే!
ఉత్సాహం ఉరకలేసినప్పుడల్లా
'బొమ్మొస్తుందా? లేదా?' అంటూ
పేజీలు తిప్పుతూ ఆడిన ఆటలకి పాఠ్య పుస్తకమంతా
కరతలామలకమైపోయేది
నెమలికన్నుకి తాటిపువ్వారం మేతేసి
పిల్ల నెమలీక కోసం రోజుల తరబడి
పుస్తకాల్లో వెతుక్కోవటం ఇప్పటికీ ఆశ్చర్యమే!

ఈడు రాకుండా పాఠశాల ప్రవేశాలు
చేరిన రోజునే బ్యాగ్డు పుస్తకాలు
అదే పనిగా అక్షరాలు బుక్కించి
పరీక్షల్లో కక్కించే ఆధునిక పోకళ్ళు
ర్యాంకులు, మార్కులు తెచ్చినా
ఎన్నటికీ జ్ఞానాన్నిచ్చేది?
జ్ఞాపకాలు మిగిల్చేది నా వీధి బడే!

- చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506