Aug 21,2022 22:14

ప్రజాశక్తి-కృష్ణలంక: కృష్ణలంక పద్మావతి ఘాట్‌లో ఏర్పాటు చేసిన ఫుడ్‌ కోర్టు నుంచి వచ్చిన వ్యర్థాలతో ఎరువు తయారు చేసే కేంద్రం నుండి వస్తున్న దుర్వాసన వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే దానిని తొలగించాలని డిమాండ్‌ చేస్తూ డివైఎఫ్‌ఐ, ఐద్వా, పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన తెలిపారు. ఈ సదర్భంగా పౌర సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్‌ దోనేపూడి కాశీనాధ్‌ మాట్లాడుతూ జనావాసాల మధ్య ఫుడ్‌ కోర్టు నుంచి వచ్చిన వ్యర్థాలను ఉపయోగించి ఎరువు తయారీ చేస్తున్నారన్నారు. దాని వల్ల వచ్చే దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, పిల్లలు భోజనం కూడా చేయలేకపోతున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో ఫుడ్‌ కోర్టు యాజమాన్యం చెలగాటం ఆడుతున్నారు. ఫుడ్‌ కోర్ట్‌లో మురిగిన వ్యర్థాలను జనావాసాల్లో ఎరువుగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. పలుమార్లు స్థానిక అధికారులకు చెప్పినా ఫుడ్‌ కోర్ట్‌ యాజమాన్యం పద్దతి మారలేదన్నారు. రాత్రుళ్లు 12 గంటల దాకా నిర్వహిస్తున్నారని, పోనుపోను నైట్‌ పబ్బుల పరిస్థితికి దారితీస్తోందని అన్నారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించి ప్రజారోగ్యాన్ని కాపాడాలన్నారు. లేని పరిస్థితుల్లో స్థానిక ప్రజలే ఫుడ్‌ కోర్ట్‌కు తాళాలు వేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు పుప్పాల కృష్ణ, నగర అధ్యక్షుడు బత్తుల ఉమామహేశ్వరరావు, పౌర సంక్షేమ సంఘం నగర నాయకులు బత్తుల చిన్నారావు, నగర నాయకులు తాండవ కృష్ణ, కాయల లక్ష్మణ, డివైఎఫ్‌ఐ డివిజన్‌ అధ్యక్షుడు జె.కొండ తదితరులు పాల్గొన్నారు.