Aug 22,2022 22:41

ప్రజాశక్తి-విజయవాడ: స్పందనలో ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించిన స్పందన కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఆర్జీదారుల నుండి వినతి పత్రాలను స్వీకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ, వర్చువల్‌ విధానం ద్వారా సంబంధిత అధికారులతో ప్రత్యక్షంగా సమస్యపై చర్చించి పరిష్కార మార్గాలను చూపించాలని ఆదేశించారు. స్పందనలో స్వీకరించిన ఆర్జీలపై జిల్లా కలెక్టర్‌ అధికారులతో మాట్లాడుతూ తమ సమస్యల పరిష్కారానికి స్పందన ఏకైక మార్గమని ఎంతో మంది ఆర్జీదారులు ఆశతో స్పందనలో తమ సమస్యలకు సంబంధించిన ఆర్జీలను అందజేస్తున్నారన్నారు. వాటిని నిశితంగా పరిశీలించి పరిష్కరించాల్సిన భాధ్యత మనపై ఉందన్నారు. సమస్యను పరిష్కరించాలనే ఆలోచన పట్టుదలను అచరణలో పెడితే పరిష్కార మార్గాలు లభిస్తాయన్నారు. ఈ దిశగా ప్రతి అధికారి ఆలోచించి తమ భాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించాలని కలెక్టర్‌ డిల్లీరావు అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమంలో 134 అర్జీల నమోదయ్యాయని వీటిలో అత్యధికంగా రెవెన్యూ 53, పోలీస్‌ 20 యంఏయుడి 7, పోలీస్‌ 20, ఏపిఎస్‌డబ్ల్యుఆర్‌ఇఐఎస్‌ 12, హెల్త్‌ 6, పంచాయతీరాజ్‌ 4, హౌసింగ్‌ 3, ఉపాధి కల్పన 3,కాగా మిగిలినవి వివిధ శాఖలకు చెందినవి 26గా ఉన్నాయని కలెక్టర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజరు, ఆర్‌డివో కె.మోహన్‌కుమార్‌, డిపివో జె.సునీత, ట్రైనీ డిప్యూటి కలెక్టర్లు రామలక్ష్మి, భాను పాల్గొన్నారు.