Mar 21,2023 20:32

రాగిజావా బలవర్ధక ఆహారం : కలెక్టర్‌

రాయచోటి : జగనన్న గోరుముద్దలో భాగంగా విద్యార్థులకు మరో పౌష్టికాహారం రాగి జావా అందించే కార్యక్రమం చాలా అద్భుతమైనదని కలెక్టర్‌ గిరీషా పిఎస్‌ తెలిపారు. జగనన్న గోరుముద్ద మరో పౌష్టికాహారం రాగి జావా అందించే బహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుండి లాంఛనంగా ప్రారంభించారు. రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హల్‌ నుంచి కలెక్టర్‌ గిరీషా పిఎస్‌, జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, డిఇఒ పురుషోత్తం, ఎపిఐఐసి డైరెక్టర్‌ శ్రీనివాసులు రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉమామహేశ్వరమ్మ, విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో ఇప్పటికే సమూల మార్పులు చేపట్టి జగనన్న గోరుముద్ద ద్వారా రోజూ రుచికరమైన మెనూతో బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఐరన్‌, కాల్షియం లాంటి పోషకాలు అందించి విద్యార్థుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు వారానికి మూడు రోజులు బెల్లంతో కూడిన రాగిజావను అందించే మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక మిగిలిన 3 రోజులు గోరుముద్దలో చిక్కీని పిల్లలకు ఇస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ను పెంచడంతో పాటు విద్యార్థుల్లో సామర్థ్యం మెరుగుపరిచి, డ్రాపౌట్స్‌ను తగ్గించేందుకు మధ్యాహ్న భోజనంలో రుచికరమైన పౌష్టికాహారాన్ని అందిస్తోందన్నారు. తల్లులు తమ పిల్లలను బడికి పంపించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్నివ్వడానికి ఉద్దేశించిన అమ్మఒడి దగ్గర నుంచి మొదలు పెడితే నాడు- నేడు ద్వారా స్కూళ్ల వ్యవస్ధను మార్పు చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. వీటితో పాటు పిల్లలకు విద్యాకానుక, గోరుముద్ద, బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌, 8వతరగతి పిల్లలకు ట్యాబులు పంపిణీ వంటి అనేక విప్లవాత్మక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందన్నారు. వీటన్నిటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, బాగా చదువుకొని ఉన్నత స్థానానికి ఎదగాలని సూచించారు.
- విద్యార్థులతో కలెక్టర్‌ గిరీష, జెసి తమీమ్‌ అన్సారీయా