Jun 29,2023 22:05

రెండో రోజు 180మంది అరెస్టు
సంయమనం పాటించాలన్న అధ్యక్షుడు మాక్రాన్‌

నాన్‌టెరె, ఫ్రాన్స్‌ : పోలీసుల దుశ్చర్యను ఖండిస్తూ ఫ్రాన్స్‌లో మంగళవారం రాత్రి నుండి కొనసాగుతున్న నిరసనలు తాజాగా మరిన్ని పట్టణాలకు, నగరాలకు విస్తరించాయి. న్యాయం కావాలని కోరుతూ వేలాదిమంది ప్రదర్శన చేపట్టారు. ఇదిలావుండగా, ఒక్కసారిగా తలెత్తిన ఈ ఉద్రిక్త పరిస్థితులను, సంక్షోభాన్ని నియంత్రించేందుకు అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌ మాక్రాన్‌ కృషి చేస్తున్నారు. సంయమనం పాటించాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రెండో రోజూ పోలీసులు 180మందిని అరెస్టు చేశారని హోం మంత్రి గెరాల్డ్‌ డార్మానిన్‌ తెలిపారు. కాల్పుల ఘటనపై సీనియర్‌ మంత్రులతో మాక్రాన్‌ సమావేశం జరిపారు. ఈ నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించాలంటూ కొంతమంది రాజకీయ ప్రత్యర్ధులు పిలుపివ్వడాన్ని ప్రధాని ఎలిజబెత్‌ బార్నె తోసిపుచ్చారు. దేశవ్యాప్తంగా దాదాపు 40వేల మంది పోలీసులను మోహరించినట్లు హోం మంత్రి తెలిపారు. అంతకుముందు రోజు మోహరించిన దానికి ఈ సంఖ్య దాదాపు నాలుగు రెట్లుగా వుంది. ఉత్తరప్రాంత పట్టణమైన మాన్స్‌ ఎన్‌ బారెల్‌లో అనేక మున్సిపల్‌ భవనాలకు నిప్పంటించారు. హోం మంత్రి అక్కడకు వెళ్ళి పరిస్థితులను సమీక్షించారు. టీనేజర్‌ మృతికి కారణమైన పోలీసుల చర్యపై ప్రభుత్వ ప్రతిస్పందన చాలా దృఢంగా వుంటుందన్నారు.
పోలీసు కాల్పుల్లో మరణించిన టీనేజర్‌ సంస్మరణార్ధం నాన్‌టెరెలో ప్రదర్శన జరిగింది. పోలీసులు తప్పు చేసినా వారిని కాపాడే పద్ధతిని విడనాడాలని ప్రదర్శకులు డిమాండ్‌ చేశారు. పోలీసుల వ్యవహార శైలిపై చాలా విమర్శలు, ఆందోళనలు నెలకొన్న దేశంలో ఇందుకు సంబంధించిన చట్టాన్ని సంస్కరించడంలో వైఫల్యంగా దీన్ని చూడాలని వారు విమర్శించారు. న్యాయ వ్యవస్థ తన పని తాను చేయాలని తాము డిమాండ్‌ చేస్తున్నామని, లేనిపక్షంలో తాము చేయాల్సింది తాము చేస్తామని ప్రదర్శకులు పేర్కొన్నారు.
టీనేజర్‌ కుటుంబానికి మద్దతుగా వేలాదిమంది వీధుల్లోకి వచ్చారు. నేల్‌కు న్యాయం జరగాలి అని రాసి వున్న టీ షర్ట్‌ను ధరించిన నేల్‌ తల్లి లారీపై నిలబడి ప్రదర్శకులకు అభివాదం చేశారు.
తాజాగా జరుగుతున్న ఆందోళనలు 2005లో ఫ్రాన్స్‌లో మూడు వారాల పాటు సాగిన అశాంతి, ఘర్షణలను గుర్తుకు తెస్తున్నాయి. ఆనాటి ఘటనలో పోలీసుల నుండి తప్పించుకునేందుకు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో దాక్కున్న ఇద్దరు యువకులు విద్యుద్ఘాతంలో మరణించడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. పదేళ్ళ తర్వాత ఆ కేసుకు సంబంధించిన ఇద్దరు పోలీసు అధికారులను నిర్దోషులుగా తేల్చారు.