ప్రజాశక్తి-విజయవాడ ప్రతినిధి
విజయవాడ నగర పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నేరాలు జరిగిన తర్వాత కాకుండా అవి జరగకుండా ముందస్తు జాగ్రత్తల (ప్రివెంటివ్ మెషర్స్) ద్వారా నేరాల నియంత్రణ చేపట్టేందుకు విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టింది. నేరాలకు అడ్డుకట్ట వేయడమే ప్రధాన లక్ష్యంగా చేరువ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది. ఎల్‌ఇడి స్క్రీన్‌లతో ప్రత్యేకంగా చేరువ వాహనాన్ని తయారు చేశారు. కమిషనరేట్ పరిధిలోని ప్రాంతాలలో సంచరిస్తూ వివిధ రకాల నేరాల నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలు గురించి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయా స్థానిక పోలీసులు అధికారులు ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు. దిశా యాప్ గురించి వివరిస్తున్నారు. దీని వల్ల కలిగే ఉపయోగాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, వీటి బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైనా అవగాహన కల్పిస్తున్నారు. మాదక ద్రవ్యాలు, వాటి వల్ల కలిగే చట్టపరమైన, ఆరోగ్య పరమైన, కుటుంబ పరమైన సమస్యలు, మహిళలు, బాలికలు, చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి అనేక రకాల నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు. వివిధ రకాల నేరాలపై ప్రత్యేకంగా రూపొందించిన షార్ట్ వీడియోలను చేరువ వాహనానికి అమర్చిన ఎల్‌ఇడి స్క్రీన్‌లపై ప్రదర్శిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఆగస్టు నెల నుంచి ఈ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నగరంలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. కొత్తపేట పిఎస్ పరిధిలో ఓల్డ్ ఆర్‌ఆర్‌పేట, కేఎల్‌రావు నగర్, భవానీపురం పిఎస్ పరిధిలో గొల్లపూడి కరకట్ట, మైలురాయి సెంటర్, కృష్ణలంక పిఎస్ పరిధిలో రాణిగారితోట, బాలాజీనగర్, పండిట్ నెహ్రూ బస్టాండ్ సిటీ టెర్మినల్, వైవిరావు హాస్పిటల్ రోడ్డు, పైడయ్య స్ట్రీట్, సత్యనారాయణపురం పిఎస్ పరిధిలో ఫుడ్ జంక్షన్, రైల్వే స్టేషన్, సీతన్నపేట గేట్ రోడ్డు, గవర్నమెంట్ ప్రెస్, అలంకార్ సెంటర్, ప్రభాస్ కళాశాల, మాచవరం పిఎస్ పరిధిలో సున్నబట్టీల సెంటర్, క్రీస్తురాజుపురం, పటమట పిఎస్ పరిధిలో చిల్లీస్ బార్ సెంటర్, ఏపిఐఐసి కాలనీ, నిమ్మతోట సెంటర్, వుడ్‌పేట సెంటర్ వంటి పలు ప్రాంతాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఇప్పటికే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణంగా నిలుస్తున్న అతివేగం, డ్రంగన్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ మైనర్ డ్రైవింగ్‌పై విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టడంతో పాటు భారీ ఎత్తున కేసులు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.










