సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు
ప్రజాశక్తి - రాయచోటి టౌన్ : పోరాట యోధుడు భగత్ సింగ్ అని సిపిఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు అన్నారు. గురువారం స్వాతంత్య్ర సమర యోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ల 92వ వర్ధంతి సభ స్థానిక సిపిఎం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 23 ఏళ్ల వయసులోనే సోషలిజమే భారతదేశానికి అంతిమ లక్ష్యం అని నమ్మి స్వాతంత్య్రం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన విప్లవ యోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లన్నారు. వారిని నిర్దాక్షిణ్యంగా ఉరి తీసినా స్వాతంత్య్ర పోరాటాన్ని బ్రిటిష్ వలసవాద ప్రభుత్వం ఆపలేక పోయిందన్నారు. భగత్‌సింగ్ మరణించిన తరువాత 16 ఏళ్ల పాటు దేశం నలుమూలలా పోరాటాలు వెల్లువెత్తాయని తెలిపారు. వీర తెలంగాణ పోరాటం, చల్లపల్లి జమీందారీ, కూలి పోరాటాలు, రైతాంగ పోరాటాలు, సైనికుల పోరాటాలతో సహా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసి దేశాన్ని వదిలి వెళ్లకతప్పని పరిస్థితికి తీసుకెళ్ళాయని, ప్రజా పోరాటాలకు ఎదురు లేదని నిరూపించాయని అన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక బ్రిటిష్ పాలనలాగే మోదాని పాలనను తీసుకొచ్చిందని, దేశ ప్రజల సంపదను, ప్రకతి వనరులను కార్పొరేట్లకు దోచిపెడుతోందని విమర్శించారు. హిండెన్‌బర్గ్ నివేదికతో మోసం బయటపడినా ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిస్సిగ్గుగా అదానీకోసమే పని చేస్తున్నాయని విమర్శించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ.రామాంజులు మాట్లాడుతూ మరణించే కొద్ది సమయం ముందు కూడా భగత్‌సింగ్ లెనిన్ వ్రాసిన రాజ్యం విప్లవం పుస్తకాన్ని అధ్యయనం చేశారని, ఆ సమయంలో కూడా దేశ ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలన్న ఆలోచన తప్ప తన ప్రాణం గురించి ఆలోచించలేదన్నారు. స్వాతంత్య్రం కోసం భగత్‌సింగ్‌తోపాటు రాంప్రసాద్ బిస్మిల్, అష్మతుల్లా ఖాన్ వంటి ఎంతోమంది అమర వీరులు మతాలకతీతంగా పోరాటాలు చేశారన్నారు. భగత్‌సింగ్ ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశామని, ప్రతి ఒక్కరూ తమ బిడ్డలను వ్యక్తిగత స్వార్ధం కోసం కాకుండా దేశంకోసం, ప్రజల కోసం ఆలోచించేలా తీర్చిదిద్దాలన్నారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు రామచంద్ర, షరీఫ్, సిఐటియు నాయకులు ఖాజాబీ, అరుణ, సిద్దమ్మ, అంజలి పాల్గొన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో...: భగత్‌సింగ్ నుంచి ప్రశ్నించడం, పోరాడటమే నేటి యువత నెరవేర్చుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ అన్నారు. పట్టణంలోనీ ఎస్.వి.విద్యా మందిర్‌లో విద్యార్థులతో కలిసి భగత్‌సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారు దోపిడిని ఎదిరించి, సామ్యావాదమే లక్ష్యంగా స్వాతంత్రోద్యమ పోరులో 23 ఏళ్ల వయస్సులోనే దేశం కోసం ఉరికంబం ఎక్కిన యువకిషోరం మన భగత్ సింగ్ అని కొనియడారారు. ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థల మూత, నూతన విద్యావిధానంతో ఆ శాస్త్రీయ విద్యను మన మీద రుద్దుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రెడ్డప్పరెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాజంపేట అర్బన్ : జాతీయ స్వాతంత్రోద్యమ యువ విప్లవ కెరటాలు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్ దేవ్ త్యాగాలను స్మరించుకుందామని వారి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పురుషోత్తం రెడ్డి పిలుపునిచ్చారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 92వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ చంద్రశేఖరరావు, అధ్యాపకులు బి.నాగరాజు, కె.రమణ, రాజమోహన్ రెడ్డి, మండల కమిటీ సభ్యురాలు వెంకటసుబ్బమ్మ, ప్రేమేశ్, శ్రీహరి, హరిశ్చంద్ర, చిన్న రామయ్య పాల్గొన్నారు.










