Jul 04,2022 06:55

మొన్నటివరకూ కరోనా రూపంలో మృత్యువు ప్రతి ముంగిట్లోనూ వికటాట్టహాసం చేసింది. ఎవరైనా మృత్యువును తప్పించుకొని తిరగాలనే చూస్తారు. హఠాత్తుగా మృత్యువు దాడి చేసినప్పుడు మానవమాత్రులు ఎవరైనా తల్లడిల్లుతారు. అయితే కవులు మాత్రం మృత్యువును నిలదీస్తూ సంభాషిస్తారు. బతుకు చిత్రాల్ని ఆవిష్కరిస్తారు. సరిగ్గా అలాంటి ఒకానొక సందర్భం నుంచి డాక్టర్‌ వెన్నం ఉపేందర్‌ జీవితాన్ని కవిత్వీకరిస్తున్నాడు. బతకడం అంటే యుద్ధం అంటూ నెమలీక జ్ఞాపకాన్ని నెమరేసుకుంటున్నాడు. బాల్యం ఎప్పుడూ భద్రపరచుకున్న ఇంగువ గుడ్డ, బాల్యం ఇసుక తిన్నెలపై నీటి సంతకం, బాల్యం ఎప్పుడూ చల్దన్నమే అని ప్రకటిస్తున్నాడు. నడిచివచ్చిన దారుల్ని కవిత్వం చేస్తూ ఒక దీర్ఘ కావ్యాన్ని సంధిస్తున్నాడు.
''ధైర్యం అంటే అలుగుకు ఎదురీదే తెగువ
పరుగెత్తే నాగుని పట్టే నిర్భీతి
సమ్మెట దెబ్బల బతుకు పోరాటం'' అంటూ నినదిస్తున్నాడు. మట్టిలో కలిసిన మహత్తర తెలంగాణా రైతాంగ పోరాట చరిత్రను ఆవాహన చేసుకుంటున్నాడు.
''బతుకు క్షేత్రాన మోదుగు పూలు పూయకపోవు
మరల మట్టి పుష్పించకపోదు
ఉరికంబాల్ని ముద్దాడిన వీరత్వం
పిడికెడు కారం.. రోకలితో పోరాటం..'' అంటూ మృత్యువు ముంగిట్లో నిలబడి
''ఆఖరి ప్రయత్నం/ ఆఖరి అవకాశం
ఆఖరి సిరా బొట్టు / ఆయుధమై జ్వలించొచ్చు
ఆలోచన రగిలించొచ్చు'' అంటూ ఆశల విత్తనాలను వెదజల్లుతున్నాడు.
డాక్టర్‌ వెన్నం ఉపేందర్‌ కవి, కథకుడు, నవలాకారుడు. మూడు దశాబ్దాల రచనా వ్యాసంగంలో 'నారుమడి, నెమలీక బరువు, కర్రు పుట్టింది' కవితా సంపుటులు, 'ఎండమావి, కొన్ని వెలుగు నీడలు' కథా సంపుటులు వెలువరించారు. ఒక నవలిక ప్రచురణకు సిద్ధంగా ఉంది. ఇటీవల 'నివేదనగా' కవిత్వం అనే ఈ దీర్ఘ కవితను వెలువరించారు.
విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ 'కొరో జాగొరితొ' పద్యంలో దేవుడిని ప్రార్థించినట్లు ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో, ఎక్కడ జ్ఞానం విరివిగా వెలుస్తుందో, ఎక్కడ స్వచ్ఛమైన బుద్ధి ప్రవాహం ఇంకిపోకుండా వుంటుందో ఆ స్వేచ్ఛా స్వర్గానికి తండ్రీ! నా దేశాన్ని మేల్కొలుపు! (చలం అనువాదం) అని ప్రార్థించినట్లుగా మోడువారుతున్న భూగోళం మీద కాస్త పచ్చదనాన్ని మొలిపించమని, మధ్యాహ్న సూరీడి నెత్తిన నీళ్లకుండతో చిలకరించమని, ఎండిన మోడు ముఖాల మీద జీవం తొణికించమని, చీకటికి తెల్ల రంగెయ్యమని ప్రార్థిస్తున్నాడు. ఠాగూర్‌కు ప్రకృతి మీద అమిత మోహం.
ఉపేందర్‌కు జీవితమంటే అత్యంత ప్రేమ. తల్లిదండ్రులు, ఇల్లూ వాకిలి, పశువులు, స్నేహితులు, స్వప్నాలు, అక్షరాలు, కవిత్వము, జీవితాన్ని ప్రభావితం చేసిన పరమ రుషులు, ఉద్యమాలు, విజయాలు - వైఫల్యాలు, ముళ్లు, రాళ్లు, నదులు, చెట్లు - రంగురంగుల పుష్పాలు.. ఒకటేమిటి తన జీవితం చుట్టూ పరుచుకున్న అనేకానేక దైనందిన వైవిధ్యభరిత విషయాల్ని ఒకానొక కవిత్వమనే ఏక సూత్రంతో బిగించి పాఠకుడి మానసిక ప్రపంచాన్ని కదిలించి కలవర పరచడం ఈ దీర్ఘ కవిత ప్రత్యేకత.
జీవితాశ అడుగంటిన ఆఖరు క్షణాన మృత్యువు ముంగిట్లో నిలబడ్డ కవి అంతర్లోకం అల్లిబిల్లిగానూ, అస్తవ్యస్తంగానూ, అన్యమనస్కంగానూ ఉండటం సహజం. అలా కాకుండా ఒక స్థిరచిత్తంతో ఎక్కడా తొట్రుపాటు లేకుండా 50 ఏళ్ల నడిచొచ్చిన తొవ్వల్ని ఏటి నీటి ప్రవాహంలా విస్తృత వ్యాఖ్యానంతో పాఠకుడి ముందు బొమ్మ కట్టించటం ఈ కావ్య ఉద్దేశం.
'సంధ్య కాంతిలో చేత కొడవలి బట్టి నక్షత్రాలు కోసుకొచ్చే తల్లి / ముళ్ళపై నడిచి నడిచి బతుకు బాటని మొలిపించిన తల్లి / చేయి పట్టుకు నడిపించిన అమ్మ యోధుడితత్వం' అంటూ అమ్మని తలుచుకుంటాడు. సౌండ్‌ ఆఫ్‌ సైలెన్స్‌ సినిమాలో మూగవాడైన పిల్లవాడు హిమాలయ పర్వత సానువుల్లో ప్రకృతితో మమేకమై గోవుల్ని కాచుకుంటూ ఒంటరిగా తిరుగాడుతుంటాడు. పుట్టుకతోనే తల్లిని కోల్పోయి నిరంతరం తల్లి తనను అంటిపెట్టుకుని ఉన్నట్లు, తన నడక ముందు ఆమె దారి చూపుతున్నట్లు, అప్పుడప్పుడు చెట్లమీది పూలను తెంపి తన దోసిలిని నింపుతున్నట్లు తల్లిప్రేమను స్వప్నిస్తుంటాడు. ఉపేందర్‌ కూడా అంతే! ఈ కవిత పొడవునా నాయనా అంటూ తండ్రిని తలుచుకుంటున్నాడు. ఎప్పుడో వెళ్లిపోయిన ఆయన జ్ఞాపకాల్ని కలవరిస్తూ కవిత్వం పొడుగునా పలకరిస్తూనే ఉంటాడు.
'నాన్నంటే రెండు కన్నీటి చుక్కలు..
నా ముందున్న కాంతి పుంజం..
పడిన ప్రతిసారి అంటుకున్న మట్టి గంధం..
రెక్క పట్టుకుని నడిపించే ఆధారం' అంటూ 'చుక్కల్ని చూపి రెక్కలు తొడుకోమన్నాడు. చెవి భూమికానిచ్చి బుంగల శబ్దం వినమన్నాడు. అడవి అంతా కాలినా కలుగులోని ఎలుకను చూడమన్నాడు. వెళ్తూ వెళ్తూ సూర్యకిరణాల్ని ఎగబాకమన్నాడు'' అంటూ తండ్రి ఇచ్చిన గొప్ప పోరాట సందేశాన్ని పదే పదే గుర్తుచేసుకుంటాడు.
'కాల్చే ఆకలి జ్వాల, తరాలుగా తరగని రోదన, జాతి సంపద స్వేచ్ఛా దోపిడి, ఎన్నో ఉద్యమాలు.. ఎన్నో జెండాలు.. కూడలి దగ్గర ఆగాయి' అంటూ ద్ణుఖపడతాడు. అనాథ రాత్రుల్లో కడుపు చూపించే దైన్యం వారసత్వ ఆస్తుల్ని పరిహసిస్తున్నదంటాడు.
''చీకట్లో దారి వెతుక్కునే వేళలో అక్షరాలే వెలుగు రేఖలు / సమూహంలో ఒకడై ఒకడే సమూహంగా ఊహింపబడి అక్షర విస్ఫోటనం చెందడమే కవిత్వం/ ఎగరాలనుకున్నప్పుడు పక్షిలా మారతాను తీరని ఆవేదన కమ్ముకున్నప్పుడు గొంతులో దుఖపునదిని అవుతాను/ ఆక్రోశం ఆగ్రహంగా మారినప్పుడు పోరాటాల జయకేతనం అవుతాను' అంటూ కవిత్వ లక్ష్యాన్ని ప్రకటిస్తాడు కవి.
వర్తమాన సమాజ విధ్వంసాన్ని తలుచుకుంటూ ఇట్లా చెబుతాడు : ''విద్యాలయాల గోడలపై గ్లోబల్‌ చిత్రాలు / ఇంట్లోకి వచ్చిన స్టాక్‌ మార్కెట్‌ / గుండెలపై సేదతీరుతున్న 'చే'/ పలుగు పార పల్లె పరాయి అయింది/ పంట పొలాల భూమి పందారమయింది/ పంట కాలువలు మాయం పలకరింపులు మాయం/ బతకాలంటే పచ్చటి గరికలా నిలబడటం సముద్రంలా వుప్పొంగటం / ఉరుములు ఒడిసి పట్టుకోవడం మెరుపుల్లా జ్వలించటం'
ఇదంతా గదికి బందీ అయిన కవి ఆలోచనల పరంపర. అతడి కలల ప్రపంచం.
''చూస్తుండగా రాలిన నక్షత్రం/ విశ్రమించని మరో మహాసముద్రం/ చేతిలో చెయ్యేసిన స్పర్శ/ మనిషిగా ఇంకా చిగురించాలని నేర్పిన స్పర్శ' అంటూ కలాంను గుర్తుచేసుకుంటాడు. అజరామరమైన ప్రేమమూర్తి మదర్‌ థెరిసాను దర్శిస్తాడు. ప్రకృతికి కూడా చావు, పుట్టుక ఉంటాయన్న రహస్య మర్మాన్ని తెలిపి నిచ్చెనమెట్ల సమాజాన్ని నిలేసిన వేమనను, బాధని భావాన్ని విడదీసి బాధ శరీరానిదన్న రామకృష్ణ పరమహంసను మదిలోకి ఆహ్వానిస్తాడు.
మృత్యువుతో దోబూచులాడుతూ తనది కాని రేపటికి ముందురాత్రి అని ఆరాత్రిని తలపోస్తూ కవి మృత్యువు తర్వాత దృశ్యాల్ని ఇట్లా వూహించుకుంటాడు. 'నక్షత్రాల్నీ, చంద్రుడిలోని అవ్వనీ, నుదుటిపై ముద్దు పెడుతున్న గాలినీ ఈ రాత్రికి ఉండమంటాను/ ఎక్కడో పూవు పూసే ఉంటుంది కంఠహారం అయ్యేందుకు/ ఎక్కడో చెట్టు సమిధగా ఎదురు చూస్తూనే ఉంటుంది/ గుప్పెడు మట్టిని పూసుకోవాలని ఉంది / వీడ్కోలు చెప్పడం అనుకున్నంత సులభం కాదు' అంటూనే 'నది అంటే వీరుల కదనోత్సాహం కదా, నదంటే జలజల పారే నీళ్లు, మనిషి మూల వాసనల హోరు..' అని ఒకపక్క సంబరపడుతూనే నగరం మృగంలా విరుచుకుపడుతుంటే మాయమైన నదికోసం ఒక కన్నీటి బొట్టును విత్తుతానంటాడు కవి. 'అనుకుంటాం గానీ నాయనా' అనే మకుటంతో సాగిన ఈ నిస్వార్థ నివేదన శకలాలు శకలాలుగా ఉన్న బతుకు ఎగుడు దిగుడు చిత్రాలను కవిత్వంతో గుదిగుచ్చి ఒక సామాజిక చరిత్రను నమోదు చేసింది. బతుకు చిగురిస్తుందో లేదో అన్న సందిగ్ధత నుంచి మొదలైన ఈ దీర్ఘకవిత శూన్యంలోకి ప్రయాణించడం అంత సులభమైన విషయం కాదన్న ఒక తాత్విక జ్ఞానాన్ని ప్రకటించడంతో ముగుస్తుంది.
                            - కాట్రగడ్డ దయానంద్‌ 94902 18383