Sep 19,2022 08:09

ఆమెదెప్పుడూ
ఓరిమిలో మొదటి స్థానం
రంగులు పులుముకోని
కుటుంబ జీవన చిత్రంలో
ఆ పాత్రదెప్పుడూ అవార్డులు అందుకోని ప్రస్థానం
అయితేనేం...!
మాటల్తో పోటీ పడకుండా
ఓటమిని అంగీకరించే మనస్తత్వం ఆమె సొంతం
ఎప్పుడూ కుటుంబాన్ని గెలిపించడంలోనే
సంతప్తి పొందే మూర్తిమత్వం ఆమె పంతం

అడుగడుగునా మనసు నొచ్చుకుంటున్నా
దానికేదో ధైర్యం నూరిపోసి
ముందుకు సాగేవి ఆమె అడుగులు
ప్రతి పనిలో ప్రతిబంధకాలు ఎదురౌతున్నా
అక్కడే నిలిచిపోలేనివి
ఆమె ప్రతిభాపాటవాలు
దారి కాచుకుని కూర్చున్న
అవమానాల పల్లేరులు
గుండె పాదానికి గుచ్చుకున్నా
ఓర్చుకుని ఓ పక్కనుంచి వెళ్ళిపోతుందే తప్ప
ఒక్కరిని కూడా తిరిగి నిందించదు
నుడుగు నుడుగులో అనుమానాలు
అడుసులా అంటుకుంటున్నా
మాటతోనే కడుగేసుకుని
మనసుకు సర్ది చెప్పకుంటుందే తప్ప
మాటా మాటా పెంచుకోదు!

ఎవరెన్ని జీవ శిల్పాలు చెక్కితేనేం
అమ్మగా తాను అడుగు ముందుకేసి
త్యాగాన్ని ముద్దాడితేనే
శిశువులనే అపురూపమైన
శిల్పకళా ఖండాలు
జగతి గతి మీద ఆవిర్భవిస్తాయి

ఆమె చిత్రం
భర్త తనువులో సగభాగం
బిడ్డ మనసులో ఎప్పటికీ పదిలం
ఆప్యాయతలో చెల్లిగా
అవసరంలో బంధువుగా
అర్థం చేసుకోవడంలో స్నేహంలా
ఒక్కటేమిటి ఇలా ...
ఎన్నో పాత్రల్లో జీవించగల
ఏకైక మూర్తిమత్వం
ఇప్పటికీ నేలమీద ఇంతిదే!

ఆమెది నటించడం తెలియని జీవితం
కష్టాలను నువ్వులతో అధిగమించగల
గొప్ప నైతికం
ఆమె చీపురుతో చెయ్యెత్తితే అపరకాళి
దించితే లోకమంతా స్వచ్ఛతా సుగుణశీలి
ఇప్పుడామె వంటింటి పాత్రల్లో దిగి
శబ్దం చేయని పాత్రై ఒదిగినా
ఇంటింటా ఆమె స్తోత్రం
చేయాల్సిందే ఎప్పటికైనా!

- కమలేశ్‌
91603 96596