Aug 21,2022 22:12

ప్రజాశక్తి-వీరులపాడు: మండలంలోని పలు గ్రామాల్లో రైతులు ముమ్మరంగా వరి నాట్లు సాగు చేపట్టారు. ఇటీవల తరచూ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు మాగాణి భూముల్లో నాట్లు వేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు చెరువులు మీద ఆధారపడి పంటలను సాగు చేస్తున్నారు. వీరులపాడు, కంచికచర్ల ప్రాంతాలకు నాగార్జునసాగర్‌ ఎడమ కాలువ ద్వారా నీటిపారుదల శాఖ నీటిని విడుదల చేస్తుంది. నవంబర్‌ నాటికి నీటిని విడుదల చేయడం ద్వారా రైతులకు కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ముందస్తు వ్యవసాయాన్ని మోటార్ల కింద నార్లను పెంచి రైతులు నాట్లు పూర్తిచేశారు. అయితే ఎక్కువమంది రైతులు వరిని సాగు చేయడానికి ముందుకు రావడంలేదు. పెరిగిన ధరలు, వ్యవసాయ ఖర్చులు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో వరి సాగు చేస్తే గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. మండలంలో సుమారు రెండు వేల ఎకరాల్లో వరి సాగవుతుంది. వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించి సాగులో మెళకువలు తెలియజేయాలని రైతులు కోరుతున్నారు.