ప్రజాశక్తి-వన్‌టౌన్: నేడు సమాజంలో పురుషునితో పాటు మహిళలు కూడా అన్ని రంగాలలో ముందుకు సాగుతున్నారని, వారి పట్ల వివక్ష చూపకుండా, గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఐఎఫ్‌ఎస్ అధికారి అరుణ్‌కుమార్ అన్నారు. అంతర్జాతీయ మహిళల సమానతా దినోత్సవం సందర్భంగా 'సేఫ్' ఆధ్వర్యంలో ఈ నెల 22 నుండి 26వ తేదీ వరకూ కళాశాలల్లో వివిధ అంశాలపై పోటీలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా సోమవారం వన్‌టౌన్ కొత్తపేటలోని పొట్టి శ్రీరాములు చలువాది మల్లిఖార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన పోటీలను అరుణ్‌కుమార్ ప్రారంభించారు. అనంతరం సేఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు స్వరూపారాణి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మహిళలు లేనిదే సమాజం లేదన్నారు. యువతరంలో ముఖ్యంగా విద్యార్థులలో లింగ సమానతపై చైతన్యం కల్పించాలనే ఉద్దేశంతో 'సమానత కొరకు ముందడుగు' అంశంలో పోస్టర్ తయారీ, ఆస్తి హక్కు కల్పించినా తగ్గని వరకట్న దురాచారం, కారణాలు, చిన్న వయసులో 'ప్రేమ, పెళ్లి, గర్భధారణ, అబార్షన్లు' యువతరంపై వాటి ప్రభావం అన్న ఆంశాల్లో వక్తృత్వం వంటి పోటీలు నిర్వహించటం పట్ల సేఫ్ నిర్వాహకులను అభినందించారు. 'సేఫ్' అధ్యక్ష కార్యదర్శులు జి.జ్యోత్న్స, జి.వాణి మాట్లాడుతూ కళాశాలలో విద్యార్థినీ విద్యార్థుల్లో బేధభావం పారద్రోలేందుకు, లింగ సమానతపై ఆలోచన కలిగించాలనే ఉద్దేశంతోనే వ్యాసరచన, వక్తృత్వం, లఘునాటిక, మైమ్, సినిమా, టివి, ఓటిటిలలో స్త్రీ పాత్రల చిత్రీకరణ, మహిళల రక్షణ సామాజిక బాధ్యతేనా అనే అంశాలపై పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్‌సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, సేఫ్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎ.రత్నలక్ష్మీ, డాక్టర్ ఎ.నీరజ, సిహెచ్.రాధాకుమారి, ఎం.శేషారత్నం, కె.హారిక, ఎం.రత్నకుమారి, ఉష, గోళ్ల నారాయణరావు పాల్గొన్నారు.










