Jun 20,2022 06:45

నేను కాషాయ దేశ భక్తను..
కర్కశ దేశ భక్తను..
నాలోని దేశభక్తి
హింసను ప్రేమిస్తుంది
ధ్వంసను ప్రేరేపిస్తుంది!

నా దేశభక్తి నిరూపించుకోవాలంటే
కత్తి మొనకు విద్వేషం పూనాల్సిందే!
దేశంనిండా ఒకే ఒక మతం కోసం
లౌకికవాదాన్ని తెగ నరకాల్సిందే..

ఇక్కడ ఎవరికీ ఏ హక్కులూ లేవు
మీ నీడలో మీరు నిలబడి
ప్రశ్నిద్దామని అనుకుంటున్నారేమో..
మీ కాళ్ల కింద బుల్డోజరు తొండాలు లేచి
మీ ఉనికిని నిరంకుశకంగా కూల్చేగలదు..
రేపటి ప్రశ్నను.. భ్రూణహత్య చేసి
మీ నిదురలోకి పీడ కలల
విష వాయువులు నింపి
శాశ్వత సమాధి కట్టే దేశభక్తి నాది!

నేను పరమ దేశ భక్తను
పేదరికానికి
అమెరికా అధ్యక్ష యాత్రికుల
మధ్య గోడ కట్టి..
నిరుపేదల ఆకలి వాకిట్లో
ఉరితాళ్ళు పంచుతాను..
నేనే చావునొప్పి తెలియకుండా
లాలిత్యంగా చంపుతూ.. వెర్రిగా నవ్వుకుంటాను..

దళితులు ముస్లింలు
హేతువాదులు బౌద్ధులు అర్బన్‌ నక్సలు
వీళ్లంతా..దేశ ద్రోహులు
గోమూత్రం పవిత్రమైనదంటే
సైన్సు వెదుకుతారు
యూనివర్సిటీల్లో భూత వైద్యం అంటే
పరాచకమాడతారు
సంజీవని మొక్క కోసం పరిశోధన అంటే
కోట్లు మింగడానికే అంటారు
వీళ్ళు దేశ ప్రగతి విరోధులు
నాదేశ భక్తి నిరూపించడం కోసం
వీళ్ళను నిరోధించడమే నా కర్తవ్యం
దేశం గుండెల మీద బుల్డోజరుని నిలబెట్టి...
రాజ్యాంగాన్ని కూల్చేయమే
ఇప్పుడు పరమ ధర్మం!
- రత్నాజీ నేలపూరి
79015 96763