Mar 22,2023 12:58

జూనియర్ సివిల్ జడ్జి సంధ్యారాణి

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్: భూ ప్రపంచంలోని అన్ని రకాల జీవుల జీవన మనుగడకు నీరే ఆధారమని జూనియర్ సివిల్ జడ్జి ఎం.సంధ్యారాణి తెలియజేశారు. బుధవారం మండల పరిధిలోని డిబిఎన్ పల్లెలో ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్కరించుకొని న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ నీటి ఆవశ్యకత గురించి ప్రజలకు వివరించారు. భూమి పైన మూడు వంతులు నీరే ఉందని., నీరు లేకుండా ఏ జీవి మనుగడ సాగించలేదని తెలిపారు. నీరు వర్షాల వలన లభ్యం అవుతుందని, సమృద్ధిగా వానలు కురవాలంటే వృక్ష సంపద పుష్కలంగా ఉండాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ వృక్షాలను పెంచాలని., అడవులను సంరక్షించుకోవాలని తెలిపారు. ఇంకుడు గుంతల ద్వారా నీటిని నిలువ చేసుకోవాలని సూచించారు. న్యాయవాది శ్రీనివాసులు మాట్లాడుతూ పోలీసు కేసులలో ముద్దాయికి జామిన్ ఇచ్చినప్పుడు కోర్టు సూచించిన తేదీకి ముద్దాయి కోర్టుకు హాజరుకావాలని.. లేనిపక్షంలో జామిన్ ఇచ్చిన వ్యక్తి జామిన్ మొత్తాన్ని కోర్టుకు చెల్లించాలని.,  లేనిపక్షంలో జామిన్ ఇచ్చిన వ్యక్తిని జైలుకు వెళ్లాల్సి వస్తుందని వివరించారు. ముద్దాయి గురించి పూర్తిగా తెలుసుకుని జామిన్ ఇవ్వాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూచివారిపల్లె పంచాయతీ కార్యదర్శి విశ్వనాథ్, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.