Mar 28,2023 20:33

- మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాజంపేట అర్బన్‌ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా డివిజన్‌లోని జగనన్న కాలనీ లేఔట్లలో వచ్చే రెండు వారాల్లోగా ఇళ్ల నిర్మాణంలో పురోగతి కనిపించాలని అధికారులను కలెక్టర్‌ గిరీష్‌ ఆదేశించారు. మంగళవారం రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో రాజంపేట డివిజన్‌లోని జగనన్న హౌసింగ్‌ లేఔట్‌లలో చేపడుతున్న మౌలిక వసతులపై, ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్ష సమావేశాన్ని రాజంపేట సబ్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌తో కలిసి గిరీష నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ జగనన్న హౌసింగ్‌ లేఔట్‌లలో ఇళ్ల నిర్మాణంలో పురోగతి కనిపించాలని, స్టేజ్‌ అప్డేషన్‌ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని, పురోగతి కనిపించకపోతే చర్యలు తప్పవని అధికారులకు స్పష్టం చేసారు. రాజంపేట డివిజన్‌కి సంబంధించి 100 రోజులకు పైగా స్టేజి కన్వర్షన్‌ కానివి మొత్తం ఎందుకు 4994 ఉన్నాయని, ఒక్క రాజంపేట (అర్బన్‌)లో స్టేజి కన్వర్షన్‌ కానివి 2933 ఎందుకు ఉన్నాయని, అధికారులను కలెక్టర్‌ ప్రశ్నించారు. రాజంపేట డివిజన్‌ మొత్తానికి పూర్తి అయిన ఇళ్ళు 37 శాతమేనని, దీనికి త్వరగా పెంచాలని అధికారులను ఆదేశించారు. రాయచోటిలోని నారాయణరెడ్డిపల్లిలో గల జగనన్న కాలనీ లేఔట్‌ను ఉదాహరణగా తీసుకొని పనులు పూర్తీ చేయాలన్నారు. పూర్తి కాబడిన పనులకు సంబంధించి బిల్లులను త్వరగా పంపించాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకు రావాలని తెలిపారు. తహశీల్దార్లు, ఎంపిడిఒలు, హౌసింగ్‌ పనుల పూర్తికి సహకరించాలని ఆదేశించారు. సచివాలయం వారీగా జగనన్న హౌసింగ్‌ లేఔట్‌లలో వారం వారం టార్గెట్‌ ఇవ్వాలని, టార్గెట్‌ను పూర్తి చెయ్యని పక్షంలో కఠినంగా చర్యలు తీసుకోవాలని రాజంపేట సబ్‌ కలెక్టర్‌కు సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ, సచివాలయ ఉద్యోగులు ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు ఇతర శాఖల అధికారులు, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.