Mar 28,2023 20:29

ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఒంటిమిట్ట : శ్రీకోదండరామస్వామి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 31 నుంచి ఏప్రిల్‌ 8 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ముందుగా కోయిల్‌ ఆళ్వార్‌ నిర్వహించడం ఆనవాయితీ. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అర్చన నిర్వహించారు. అనంతరం 8 గంటల నుంచి 11.30 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గర్భాలయం, శ్రీ ఆంజనేయస్వామి, శ్రీగరుత్మంతుని సన్నిధి, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పును నీటితో శుద్ధి చేశారు. 11.30 గంటల తరువాత స్వామి వారి దర్శనాన్ని భక్తులను అనుమతించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఇఒ నటేష్‌ బాబు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ ధనంజయులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
వాహన సేవలు : ఈ నెల 31న ధ్వజారోహణం, శేషవాహనంపై స్వామివారిని అలంకరిస్తారు. ఏప్రిల్‌ 1న హంసవాహనంపై వేణుగానాలంకారం, 2న సింహవాహనంపై వటపత్రశాయి అలంకారం, 3న హనుమత్సేవ వాహనంపై నవనీత కృష్ణాలంకారం, 5న మోహినీ అలంకాయంలో గరుడ సేవ, 5న గజవాహనంపై శివదనుర్భంగాలంకారం, ఆరోజే కల్యాణం నిర్వహిస్తారు. 6న రథోత్సవం, 7న ఆశ్వవాహనంపై కాళీయమర్దనాలకారం, 8న చక్రస్నానం, ఆశ్వవాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు.
- ధ్వజస్తంభాన్ని శుద్ధి చేస్తున్న అర్చకులు