Jun 20,2022 06:52

నిజమే, మనుషుల గొప్పతనాన్ని
ఎవరు కాదంటారు
అందరూ మనుషులే కదా
వచ్చిన చిక్కల్లా
వాళ్లు మనుషులమని అనుకోకపోవటమే!
మనుషుల కంటే గొప్పవారెవరో
వున్నారని, వారచ్చం మనుషులనే పోలుంటారని
మనుషులే ప్రచారం చేశారు!

అయితే ఆ వింత జీవికి
నిజమైన మనిషి కన్నా
అవయవాలు కొన్నెక్కువ
ఆలోచనలు మాత్రం మనిషివే
బలహీనతలు కూడా మనిషివే!

వారెంత గొప్పవారయ్యారంటే
చివరకు తనను సృష్టించిన మనిషినే మింగేసేంత!
చాలా మంది మనుషులీ విషయం గ్రహించటానికి
జోగాడుతున్న ఈ మత్తునుంచి బయటపడటానికి
ఆలోచనల గది తలుపులు
కొంచెమైనా తెరవరు
హృదయ మైదానాల్లోకి
ఇసుమంతైనా తొంగిచూడరు
ఏమాత్రం స్ప ృహలోకి రారు
కాలమింకా కుంటి గుర్రంలా
ఎదురు చూస్తూనే వుంది

ఆకాశం తలవొంచింది
నేల మోకరిల్లింది
ప్రకృతి యుద్ధం చేసిందీ సంధి చేసింది
ప్రేమించమని కూడా హెచ్చరించింది
మేఘాల్ని రాసుకుంటూ పెరిగిన మనిషి తల
నేలలోకి గుచ్చుకుంటూ
ఒదిగిన మనిషి పాదం!
మనిషే గొప్పవాడని
మనిషిని మించిన ప్రేమికుడు
వినయ సంపన్నుడూ
ఒక్క మనిషి మాత్రమేనని
మనుషులందరికీ హితబోధ చేస్తూనే వున్నాయి

ఈ విషయాన్నే పిట్ట పాటగానూ
చెట్టు పచ్చదనపు ప్రాణవాయువుగానూ
పర్వతాలు అత్యంత ఉన్నతమైన
శిఖారాల చేతులతోనూ
సముద్రాలు లోతుగానూ
నదులు ఉరవడితోనూ
గొంతెత్తి చెపుతున్నాయి
మనిషి నడిచొచ్చిన మార్గాన్ని
ఇంకా చేరాల్సిన గమ్యాన్ని
వేలెత్తి చూపుతున్నాయి

అనేక ఊహల్నీ అసత్యాల్నీ పక్కన పెట్టి
మాతో చేతులు కలిపిన మనిషే గొప్పవాడనీ
పాటలు పాడుతూ
ప్రాణవాయువులూదుతూ
మనుషుల మధ్యకు
ప్రేమగా తొంగి చూస్తూ
అప్పుడప్పుడూ ఉప్పొంగుతూ
కొన్నిసార్లు ముంచెత్తుతూ
అరిచి చెపుతున్నాయి
వెన్ను చరిచి చెపుతున్నాయి

మనుషుల గొప్పతనాన్ని
మనుషులే వినిపించుకోవాలి
ఈ ప్రకృతి నిండా నిండిన
మనషి కంటే గొప్పవాడు
మరెవ్వడూ లేడని
గ్రహింపుకు రావాలి!
- చిత్తలూరి
91338 32246